హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ స్పూర్తితో బీసీ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకు పోవాలని పిలుపునిచ్చారు బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు చిరంజీవులు . హైదరాబాద్‌లోని బాగలింగంపల్లి లొ గల సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం (బీసీఐ) విస్తృత స్థాయి రాష్ట్ర సమావేశం ఘనంగా జరిగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఈసమావేశానికి హాజరయ్యారు .ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు చిరంజీవులు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, వనరులపై నియంత్రణ, బడ్జెట్ లో వాటా,రాజకీయ అధికారం సాధించడమే లక్ష్యంగా “హిస్సా – ఇజ్జత్ – హుకూమత్” నినాదంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు.
గత ఎనిమిది దశాబ్దాలుగా బీసీ సమాజం ఎదుర్కొంటున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక , సాంస్కృతిక అన్యాయాలను ఆయన వివరించారు. బీసీలు సంఘటిత శక్తిగా ఎదిగి రాజ్యాధికారాన్ని సాధించాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాజ్యాధికారం లేకుండా ఏ సమాజమైనా తన అస్తిత్వాన్ని, అభివృద్ధిని కాపాడు కోలేదని అన్నారు. ఈ సమావేశానికి కాకతీయ విశ్వ విద్యాలయం మాజీ ప్రొఫెసర్ ప్రొఫెసర్ బెనర్జీ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ విజయ్ బాబు, ప్రొఫెసర్ సాయిలు, ప్రొఫెసర్ శ్రీనివాసులు, ప్రొఫెసర్ ప్రసాద్ గౌడ్, ప్రొఫెసర్ వీరస్వామి తదితరులు పాల్గొని బీసీ ఉద్యమ దిశ, దశ, భవిష్యత్ కార్యాచరణపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
