తిరుపతి : తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వుండాలని ఎపిఎస్పిడిసిఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి స్పష్టం చేశారు. ఎపిఎస్పిడిసిఎల్ పరిధిలో తుఫాను ప్రభావం ఎక్కువగా వుండే నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అధికారులు, సిబ్బంది ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన సందర్భాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులను సంబంధిత నోడల్ ఆఫీసర్లు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం వున్న ప్రాంతాల్లో సంబంధిత సూపరింటెండింగ్ ఇంజనీర్లు అప్రమత్తంగా వుండాలని ఆదేశించారు.
భారీ వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిన సందర్భాల్లో సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించేందుకు వీలుగా అధికారులు, సిబ్బందితో కూడిన బృందాలను సిద్ధంగా వుంచుకోవాలని సూచించారు. అంతేకాకుండా సరఫరా పునరుద్ధరణకు అవసరమైన విద్యుత్ స్తంభాలు, కండక్టర్, ట్రాన్స్ ఫార్మర్లు, ఇన్సులేటర్లు, డిస్క్ లు, భద్రతా పరికరాలను, ఆ పరికరాలను అవసరమైన ప్రాంతాలకు తరలించేందుకు వాహనాలను అందుబాటులో వుంచుకోవాలని సూచించారు. పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందు వీలుగా సంబంధిత కాంట్రాక్టర్లు కూడా అందుబాటులో వుండే విధంగా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.
సంస్థ పరిధిలో సర్కిల్స్, డివిజన్స్, సబ్-డివిజన్స్, సెక్షన్స్ స్థాయిల్లో నోడల్ ఆఫీసర్లను నియమించామని, అదే విధంగా కంట్రోల్ రూమ్స్ ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడం కోసం అధికారులు/ సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందాలు అందుబాటులో వుండాలన్నారు ఎండీ . భారీ వర్షం కురుస్తున్న సందర్భాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుందని, ప్రజలు తమ గృహాల్లో చార్జింగ్ లైట్లు, తాగు నీటిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. వర్షం కురుస్తున్న సమయంలో ప్రజలు విద్యుత్ స్తంభాలను తాకవద్దని, లైన్ల కింద నిల్చోవద్దని సూచించారు.
ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, లైన్లు తెగిపడడంలాంటి సంఘటనలను గుర్తించినట్లయితే తక్షణమే సమీపంలోని విద్యుత్ శాఖ అధికారులు/సిబ్బందికి గానీ లేదా టోల్ ఫ్రీ నంబర్లు: 1912 లేదా 1800 425 155333కు కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు. అదేవిధంగా సంస్థ వాట్సాప్ నంబరు: 91333 31912కు చాట్ చేయడం ద్వారా విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించు కోవచ్చని సిఎండి శివశంకర్ లోతేటి పేర్కొన్నారు.


















