మంచిర్యాల జిల్లా : తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవన బీమా పథకం పేద కుటుంబాలకు ఒక వరం అని అన్నారు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం గంగిపల్లి గ్రామంలో ‘ఇందిరమ్మ కుటుంబ జీవన భీమా పథకం’ కోసం నమోదు ప్రక్రియను ప్రారంభించారు. ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని చెప్పారు. ఈ పథకం కింద రేషన్ కార్డు ఆధారంగా 18 నుండి 59 ఏళ్ల వయస్సు గల అర్హులైన కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల జీవిత భీమా కవరేజీని అందిస్తున్నామని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబం ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ తాము ‘ఇందిరమ్మ ఇళ్లు’, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నాణ్యమైన బియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’ ద్వారా రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్యం, కొత్త ‘ఆసరా’ పింఛన్లు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనం వంటి పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు.
గంగిపల్లి గ్రామాభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ గ్రామంలో 118 ఇందిరమ్మ ఇళ్లను’ మంజూరు చేశామని, ఇందులో ఇప్పటికే 85 ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని తెలిపారు. గ్రామ పాఠశాల అభివృద్ధి కోసం రూ. 50 లక్షలు కేటాయించడంతో పాటు, గత ఏడాది , ఈ ఏడాది కలిపి మొత్తం రూ. 30 లక్షల సీఎస్ఆర్ (CSR) నిధులను మంజూరు చేశామన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రూ. 1.57 కోట్ల వ్యయంతో నిర్మించిన గంగిపల్లి–ఎల్కంటి రహదారిని నేను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు . అలాగ శ్మశానవాటికకు వెళ్లే రహదారి నిర్మాణానికి రూ. 2 కోట్లు మంజూరు చేశామన్నారు. గంగిపల్లి గ్రామస్తులకు జైపూర్ విద్యుత్ కేంద్రంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో 1,250 మెగావాట్ల సామర్థ్యం గల కొత్త విద్యుత్ కేంద్రం అందుబాటులోకి వచ్చినప్పుడు భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఉపాధి కల్పించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.


















