హైదరాబాద్ : హైదరాబాద్ మహానగర తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని సింగూర్ రిజర్వాయర్ పరిధిలో చేపడుతున్న అత్యవసర పంపింగ్ ఏర్పాట్ల పై జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి ఆరాదీశారు. పటాన్‌చెరు ట్రాన్స్మిషన్ డివిజన్ -2 పరిధిలో జరుగుతున్న ఎమర్జెన్సీ పంప్‌సెట్ అలైన్‌మెంట్ పనులను సంబంధిత ఏజెన్సీ ప్రతినిధులు, అధికారులతో ఆయన సమీక్షించారు. సింగూర్ జలాశయంలో ప్రస్తుతం నీటి మట్టం 516.080 అడుగులుగా ఉండగా, అందుబాటులో ఉన్న నీటి నిల్వ సామర్థ్యం 5.477 టీఎంసీలుగా నమోదైందని తెలిపారు. జూన్ 1, 2026 నుంచి అత్యవసర పంపింగ్‌ను పాక్షిక స్థాయిలో ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు ఎండీకి వివరించారు. రిజర్వాయర్ 516.00 అడుగుల నీటి మట్టం వద్ద సుమారు 5.340 టీఎంసీల నీటి నిల్వ అందుబాటులో ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా ఎండీ అశోక్ రెడ్డి మాట్లాడుతూ నగరానికి తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా అత్యవసర పంపింగ్ వ్యవస్థను సకాలంలో సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పంప్‌సెట్ అలైన్‌మెంట్, విద్యుత్ సరఫరా, మెకానికల్ లతో పాటు ఎలక్ట్రికల్ అంశాలన్నింటినీ సమన్వయంతో పూర్తి చేసి, అత్యవసర పంపింగ్‌ను నిర్దేశిత గడువులో ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా వ్యవహరించాలని, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని పలు సూచనలు చేశారు. ప్రతి దశలో పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, తలెత్తే సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
