ఆక్వా క‌ల్చ‌ర్ రైతుల‌కు విద్యుత్ రాయితీ

ప్ర‌క్రియ తుది ద‌శ‌లో ఉంద‌న్న అచ్చెన్న

hellotelugu-Atchannaidu

విజ‌య‌వాడ : ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ఆక్వా క‌ల్చ‌ర్ రైతుల‌కు సంబంధించి. సంబంధిత సాగు రైతులకు విద్యుత్ రాయితీపై మంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జూన్ 1 నుంచి అదనంగా 12 వేల ఆక్వాకల్చర్ విద్యుత్ కనెక్షన్లకు యూనిట్‌కు రూ.1.50 చొప్పున రాయితీ అందించే ప్రక్రియ తుది దశలో ఉందన్నారు. ఉత్తర్వులు జారీ అయిన తర్వాత అర్హత కలిగిన అన్ని ఆక్వాకల్చర్ కనెక్షన్లు అవి చిన్న, పెద్ద ఫారాలు అయినా, ఆక్వా జోన్ లేదా నాన్-ఆక్వా జోన్‌లో ఉన్నా ఈ పథకం పరిధిలోకి వస్తాయని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో ఉత్పత్తి వ్యయం తగ్గడంతో పాటు రైతులకు గణనీయమైన ఆర్థిక ఉపశమనం లభిస్తుందని తెలిపారు. మత్స్య, ఆక్వాకల్చర్ రంగాల్లో స్థిరమైన అభివృద్ధి, పోటీతత్వ సామర్థ్యాల పెంపు, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు పునరుద్ఘాటించారు.

రైతు ప్రతినిధులు తాత్కాలికంగా కిలోకు రూ.6 మేర మాత్రమే ధర పెంపును ఒక నెలపాటు పరిమితం చేయాలని సూచించినట్లు తెలిపారు అచ్చెన్నాయుడు. అలాగే మత్స్యశాఖ, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్‌వాటర్ ఆక్వాకల్చర్ (సీబా), రైతు సంఘాలు, ఫీడ్ తయారీదారుల ప్రతినిధులతో కూడిన శాస్త్రీయ ధరల కమిటీ ఏర్పాటు ప్రతిపాదన కూడా వచ్చినట్లు చెప్పారు. ఈ కమిటీ ముడి పదార్థాల ధరలు, డబ్ల్యూపీఐ తదితర ప్రమాణాలను పరిశీలించి సిఫార్సులు చేయనుందని వివరించారు. ఇదే సమయంలో, కొత్త ధరల విధానం అమల్లోకి వచ్చే వరకు కిలోకు రూ.12 మేర తాత్కాలిక పెంపును పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తయారీదారులు తెలిపారని మంత్రి పేర్కొన్నారు. అయితే ఈ అంశంపై తుది ఏకాభిప్రాయం కుదరక పోవడంతో పరస్పర సంప్రదింపుల ద్వారా త్వరితగతిన పరిష్కారం కనుగొనాలని ప్రభుత్వం సూచించిందన్నారు.

Exit mobile version