న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది నీట్ – యుజి 2026 పేపర్ లీకు కేసు. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ చేపట్టింది. ఇందుకు సంబంధించి ఇవాళ కీలక అప్ డేట్ వచ్చింది. తాజాగా సంచలన ప్రకటన చేసింది సీబీఐ. ఈ మేరకు పేపర్ లీకులో డాక్టర్ తో పాటు ఫిజిక్స్ అధ్యాపకుడిని కూడా అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. ఈ కేసులో ఇప్పటివరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహ్లియానగర్ నుండి మొత్తం 13 మంది నిందితులు అరెస్టు అయ్యారు. వీరితో పాటు మరో ఇద్దరిని ఇవాళ అదుపులోకి తీసుకోవడంతో తీగ లాగితే డొంకంతా కదిలింది. ఈ కేసులో అరెస్టు అయిన వారి మొత్తం సంఖ్య 13కి చేరింది.
నీట్ – యుజి 2026 ప్రశ్నల లీక్ కేసులో లాతూరు కేంద్రంగా పని చేసే డాక్టర్ మనోజ్ షిరూరే అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. ఒక కోచింగ్ సెంటర్ యజమాని కుమారుడితో సహా ముగ్గురు విద్యార్థులకు, నిందితుడు పీవీ కులకర్ణి నుండి కెమిస్ట్రీ ప్రశ్నలను ఇప్పించడంలో కీలక పాత్ర పోషించాడు.మరో వైపు అరెస్టు అయిన మరో నిందితుడు తేజస్ హర్షద్‌కుమార్ షా. ఇతను పూణే కేంద్రంగా పనిచేసే ‘డాక్టర్ అభంగ్ ప్రభు మెడికల్ అకాడమీ లో ఫిజిక్స్ అధ్యాపకుడిగా పని చేస్తున్నాడు.నీట్ పరీక్షకు సంబంధించిన లీక్ అయిన ఫిజిక్స్ ప్రశ్నలను, అరెస్టయిన నిందితురాలు మనీషా హవల్దార్ నుండి పొందాడు. ఈ కేసులో నిందితుల గొలుసుకట్టు సంబంధాలను , కుట్రను వెలికితీసేందుకు దర్యాప్తు కొనసాగుతోందని ప్రకటించింది సీబీఐ.
ఇప్పటి వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లోని 49 ప్రదేశాలలో సోదాలు నిర్వహించి, నేరానికి సంబంధించిన పలు కీలక పత్రాలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న వస్తువులపై సమగ్ర విశ్లేషణ జరుగుతోందని ప్రకటించింది సీబీఐ.
