అమరావతి : ఏపీ రైతులకు ఖుష్ కబర్ చెప్పింది సర్కార్. ఖరీఫ్-2026 సీజన్‌కు సంబంధించి పంట దిగుబడి ఆధారిత ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద వరి పంట మినహా మిగిలిన అన్ని నోటిఫై చేసిన ఖరీఫ్ పంటలకు పంటల బీమా నమోదు గడువు ఈరోజు జూలై 31తో ముగియాల్సి ఉండగా, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 15 వరకు మరో 15 రోజులపాటు పొడిగించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన PMFBY నోటిఫికేషన్ ప్రకారం వరి మినహా అన్ని పంటలకు జూలై 31 వరకు, వరి పంటకు ఆగస్టు 15 వరకు బీమా నమోదు గడువు నిర్ణయించగా, రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, బీమా సంస్థలతో విస్తృతంగా చర్చించి, వరి మినహా మిగిలిన అన్ని ఖరీఫ్ పంటలకు కూడా గడువును ఆగస్టు 15 వరకు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం, బీమా సంస్థలు సానుకూలంగా స్పందించి, PMFBY కింద నోటిఫై చేసిన వరి మినహా అన్ని ఖరీఫ్ పంటలకు పంటల బీమా నమోదు గడువును జూలై 31 నుంచి ఆగస్టు 15 వరకు పొడిగించడం రైతులకు ఎంతో ఊరటనిచ్చే నిర్ణయమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావం, ఇతర అనుకోని పరిస్థితుల వల్ల రైతులకు కలిగే పంట నష్టాలకు ఆర్థిక రక్షణ కల్పించడంలో పంటల బీమా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అందువల్ల రుణగ్రహీత, రుణేతర రైతులు అనే తేడా లేకుండా అర్హులైన ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పంటల బీమాలో నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
