GST : దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ ఎంతగానో పెరిగిన విషయం తెలిసిందే. పండుగలు, శుభకార్యాలు వస్తే బంగారం కొనుగోలు తప్పనిసరి అనుకునే వారు ఎక్కువ. అయితే ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ పలు వస్తువులపై పన్ను తగ్గింపులు చేయడంతో బంగారం ధరలపై కూడా ప్రభావం ఉంటుందా అనే ప్రశ్నలు వినిపించాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. బంగారం, వెండిపై అమల్లో ఉన్న జీఎస్టీ (GST) రేట్లలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది.
GST – ప్రస్తుత జీఎస్టీ రేట్లు
బంగారం బార్లు, నాణేలు, ఆభరణాలపై 3 శాతం జీఎస్టీ కొనసాగుతోంది. నగల తయారీ ఖర్చుపై 5 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. ఉదాహరణకు రూ.1,00,000 విలువైన బంగారం కొంటే దానిపై రూ.3,000 జీఎస్టీ అదనంగా చెల్లించాలి. ఒకవేళ అదే మొత్తంలో బంగారు ఆభరణాలు కొంటే, బంగారం విలువపై 3% జీఎస్టీతో పాటు తయారీ ఖర్చుపై 5% పన్ను కూడా వర్తిస్తుంది.
పన్నుల లెక్కింపు విధానం
- బంగారం కొనుగోలు సమయంలో బిల్లులో ఈ అంశాలు ఉంటాయి:
- బంగారం విలువ – కొనుగోలు రోజు రేటు, బరువు, స్వచ్ఛత (క్యారెట్) ఆధారంగా నిర్ణయిస్తారు.
- తయారీ ఖర్చులు – నగలు తయారుచేయడంలో వచ్చే వ్యయం. ఇది బంగారం విలువపై 8% నుంచి 25% వరకు ఉండవచ్చు.
- వేస్టేజీ ఛార్జీలు – నగల తయారీ సమయంలో వృథా అయ్యే బంగారం ఖర్చు.
- జీఎస్టీ – బంగారం విలువ, తయారీ ఖర్చులు, వేస్టేజీపై వర్తిస్తుంది. సాధారణంగా బంగారం విలువపై 3% జీఎస్టీ, తయారీ ఖర్చుపై 5% జీఎస్టీ వసూలు చేస్తారు.
వ్యాపారులకు ఊరట
జీఎస్టీ సవరణలు పలు వస్తువులపై అమలులోకి వచ్చినా, బంగారం పన్నుల్లో మార్పులు లేకపోవడంతో బులియన్ వ్యాపారులు, జువెలరీ రంగం సాంత్వన చెందింది. పండుగ సీజన్లలో వ్యాపారంపై ప్రభావం ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read : GST Reforms Sensational : జీఎస్టీ రిఫార్మ్స్ తో రైతన్నలకు శుభవార్త
