Headache : సాధారణంగా తలనొప్పి అనేది ప్రతీ ఒక్కరికీ అప్పుడప్పుడు ఎదురయ్యే సమస్య. అయితే అదే తలనొప్పి నిర్దిష్ట సమయాల్లో, తల ఒక వైపున తీవ్రమైన నొప్పిగా మారితే దాన్ని తేలికగా తీసుకోవడం సరికాదు. ఇది మైగ్రేన్ (Migraine) అనే నరాల సంబంధిత సమస్యగా మారే అవకాశం ఉన్నదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Headache – మైగ్రేన్ లక్షణాలు ఇలా ఉంటాయి
మైగ్రేన్ ప్రధానంగా తల ఒక వైపున తీవ్ర నొప్పితో (Headache) కనిపిస్తుంది. ఈ నొప్పి కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల వరకూ కొనసాగవచ్చు. కాంతి, శబ్దం, వాసనలపై అసహనం, వికారం, వాంతులు, మెడలో గట్టి పడటం, అలసట, తలతిరగడం వంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి. కొంతమందికి మైగ్రేన్ ప్రారంభానికి ముందు హెచ్చరిక లక్షణాలు (Aura Symptoms) వస్తాయి. ఉదాహరణకు: చూపులో మార్పులు, ఆలోచనలో అర్థం లేకపోవడం, చేతులు పాదాల్లో మొనదేరడం వంటి లక్షణాలు ముందస్తుగా కనిపించవచ్చు.
మూలకారణాలపై దృష్టి పెట్టాలి
మైగ్రేన్‌ను ప్రేరేపించే అనేక అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా నిద్ర లోపం, అధిక మానసిక ఒత్తిడి, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, హార్మోన్‌ల మార్పులు, చాక్లెట్, చీజ్, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, అధికంగా కెఫిన్ వినియోగం, వాతావరణ మార్పులు, మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ల వాడకం వంటివి మైగ్రేన్‌ను ప్రేరేపించే అంశాలుగా గుర్తించబడ్డాయి.
నివారణకు ఈ జాగ్రత్తలు పాటించాలి
- ప్రతి రోజు సమయానికి విశ్రాంతి మరియు పూర్తి నిద్ర తీసుకోవడం
- ఆకలితో ఉండకుండా సమతుల్య ఆహారం తీసుకోవడం
- స్క్రీన్ సమయాన్ని తగ్గించడం, ముఖ్యంగా రాత్రివేళ
- బలమైన వెలుతురు లేదా వాసనలు ఉన్న వాతావరణాల నుంచి దూరంగా ఉండటం
- యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటి సాధనల ద్వారా ఒత్తిడిని తగ్గించడం
- మైగ్రేన్ లక్షణాలు మొదలైన వెంటనే నిశ్శబ్ద, చీకటి గదిలో విశ్రాంతి తీసుకోవడం
- కొందరికి ఐస్ ప్యాక్‌ను తలపై పెట్టడం ఉపశమనం కలిగిస్తుంది
వైద్య సలహా అవసరమయ్యే సందర్భాలు
తలనొప్పి (Headache) పదేపదే వస్తుండటం, సాధారణ నివారణ చర్యలకు స్పందించకపోవడం, అలాగే చూపులో మార్పులు, మాట్లాడటంలో ఇబ్బంది, మూర్ఛ వంటి తీవ్రమైన లక్షణాలు కనిపించడమే కాకుండా, దైనందిన జీవనశైలిపై ప్రభావం చూపుతున్నప్పుడు వెంటనే నెవురాలజీ నిపుణుడిని సంప్రదించడం అవసరం.
మైగ్రేన్ పూర్తిగా నయం కావడం సాధ్యపడకపోయినా, దాన్ని సమయానికి గుర్తించి సరైన జాగ్రత్తలు తీసుకుంటే దాని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. ప్రజల్లో మైగ్రేన్ పై సరైన అవగాహన పెరగడం ద్వారా దీని ప్రభావాన్ని గణనీయంగా తగ్గించడమేకాకుండా, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Also Read : Figs Interesting Facts : ఈ అంజీర్ పండ్లు పాలలో నానబెట్టి తింటే ఆ సమస్యలు సూన్యం
