ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రోడ్ల నాణ్య‌త‌పై రాజీ ప‌డొద్దు

స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్

hellotellugu-APRoads

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో రోడ్ల నాణ్య‌త‌పై రాజీ ప‌డే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. గ్రామాల్లో మురుగు నీటి సమస్యను శాశ్వతంగా అరికట్టేందుకు మ్యాజిక్ డ్రెయిన్స్ విధానాన్ని మరింత ఎక్కువ గ్రామాల్లో ప్రవేశ పెట్టాలన్నారు. నల్లరేగడి నేలలు, డెల్టా ఏరియాల్లో నీరు ఎక్కువగా నిల్వ ఉంటుంది కాబట్టి, అక్కడి భూములకు తగినట్లుగా ఈ మ్యాజిక్ డ్రెయిన్లను నిర్మించాలన్నారు. కొండలు, గుట్టలతో కూడిన మారుమూల గిరిజన గ్రామాల్లో కూడా పరిశుభ్రతను పెంచేందుకు ఈ సరికొత్త డ్రైనేజీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకు రావాలన్నారు. ఈ పనులు చాలా కాలం మన్నేలా, శాస్త్రీయంగా ఉండటం కోసం నిపుణులైన ఇంజనీర్లు, పారిశుధ్యం-ప్రజారోగ్య నిపుణులు సలహాలు, సూచనలు కచ్చితంగా తీసుకోవాలన్నారు.

గ్రామాల్లో నిర్మించే సీసీ రోడ్లు దీర్ఘకాలం మన్నేలా ఉండాలని అన్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. రోడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలన్నారు. నాణ్యత లోపిస్తే సహించేది లేదని హెచ్చ‌రించారు. సీసీ రోడ్డు వేసిన తర్వాత ఇరువైపులా అలాగే వదిలేయకుండా, మట్టితో పక్కాగా వాలు చేయాలన్నారు. వాలు చేయకుండా వదిలేస్తే వాహన ప్రమాదాలు జరిగే అవకాశంతో పాటు వర్షా కాలంలో నీరు నిలిచిపోయి రోడ్డు అంచులు త్వరగా పాడైపోతాయన్నారు. పల్లె ప్రజలకు నాణ్యమైన, దీర్ఘకాలం మన్నే రహదారులను అందించడమే లక్ష్యంగా రోడ్లకు జియో మానిటరింగ్ సిస్టమ్ ను తీసుకొచ్చాం అన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. రోడ్ల పర్యవేక్షణ, డూప్లికేషన్ కు చెక్ పెట్టేందుకు ఈ డిజిటల్ పద్ధతి సహాయ పడుతుందన్నారు. ఏ గ్రామంలో, ఏ ప్రాంతంలో ఎంతవరకు రోడ్డు పనులు జరిగాయో శాటిలైట్, జియో-ట్యాగింగ్ ద్వారా క్షేత్రస్థాయిలో కచ్చితంగా తెలుసుకునే వీలు ఉంద‌న్నారు.

Exit mobile version