పోల‌వ‌రం నిర్మాణంలో పొర‌పాట్ల‌కు తావీయ‌కండి

క్షేత్రస్థాయిలో పనుల పరిశీలన అధికారులతో సమీక్ష

hellotelugu-PoalaavaramTeam

పోలవరం : వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పోలవరం ప్రాజెక్ట్ లో కీలకమైన ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ (ఈ సి ఆర్ ఎఫ్ ) నిర్మాణ సమయంలో ఎలాంటి ఏమరపాటుకు ఆస్కారం ఇవ్వవద్దని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ( పీ పీ ఏ సి ఈ ఓ ) సంజీవ్ వోహ్రా సూచించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో ఈ సి ఆర్ ఎఫ్ నిర్మాణప్రాంతంలో రోడ్ రోలర్ నడిపించి ఇప్పటి వరకు జరిగిన నిర్మాణం పటిష్టతను పరిశీలించారు. సంతృప్తి వ్యక్తం చేశారు. డ్యామ్ నిర్మాణ ప్రాంతమైన గ్యాప్ 1, గ్యాప్ 2 లో దశల వారీగా రాయి, మట్టి, ఇసుక తో నింపుతున్నందు వల్ల నిత్యం రోడ్ రోలర్ తో ఈ ప్రాంతాన్ని గట్టి పరుస్తూ ఉండాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టులోని ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ (ఈ సి ఆర్ ఎఫ్ ) నిర్మాణ ప్రాంతం గ్యాప్ 1, 2 , జి హిల్ మొదలైన వాటిని కాలి నడకన పరిశీలించారు. జి హిల్ నుంచి ఈ సి ఆర్ ఎఫ్ నిర్మాణాన్ని అధికారులతో కలిసి వీక్షించారు. అంతకు ముందు ఆయన ప్రాజెక్ట్ కార్యాలయ సమావేశ మందిరంలో జలవనరుల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమీక్షలో పీపీఏ ఉప సంచాలకులు రవి, జలవనరుల శాఖ ఇంజినీర్‌-ఇన్‌-చీఫ్‌ కె. నరసింహమూర్తి, పర్యవేక్షక ఇంజినీర్‌ పి. రామచంద్రరావు , నాణ్యతా విభాగం సి ఈ శేషుబాబు, జలవనరుల శాఖ ఈఈ డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్ట్ లో ప్రస్తుతం జరుగుతున్న పనులను జలవనరుల శాఖ అధికారులతో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థ మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎం ఈ ఐ ఎల్ ‌) జనరల్‌ మేనేజర్‌ ఎ. గంగాధర్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ మురళి పమ్మి, జి. శంకరయ్య తదితరులు పీపీఏ సి ఈ ఓ వోహ్రా కు వివరించారు. ప్రాజెక్ట్ నిర్మాణం అనుకున్న తేదీకి పూర్తి చేయాలని, అందుకు అవసరమైన పూర్తి సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని సీఈఓ స్ప‌స్టం చేశారు. ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే కృత నిశ్చయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు, నిర్మాణ సంస్థకు ఆయన గుర్తు చేశారు. నిర్మాణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే తన దృష్టికి తీసుకు వస్తే వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

Exit mobile version