Gold : 2025 దీపావళి వేళ భారతీయ బులియన్ మార్కెట్ వేడి పుంజుకుంది. పండుగ సీజన్‌ను పురస్కరించుకుని బంగారం, వెండి ధరలు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎగసిపడుతున్నాయి. ఈ సంవత్సరం ఇప్పటివరకు బంగారం ధరలు 47 శాతం, వెండి ధరలు 52 శాతం మేర పెరిగి రికార్డులు సృష్టించాయి.
Gold – MCXలో కొత్త రికార్డు
సోమవారం మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో బంగారం (Gold) ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు రూ.1.20 లక్షలు దాటింది. మునుపటి అన్ని గరిష్టాలను అధిగమిస్తూ, 10 గ్రాముల బంగారం ధర రూ.1,20,770కి చేరుకుంది. బులియన్ మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం, దీపావళి నాటికి బంగారం ధర రూ.1.25 లక్షలు దాటే అవకాశం ఉందని చెబుతున్నారు.
Gold – దేశీయ బులియన్ మార్కెట్‌లో ఉత్సాహం
స్థానిక మార్కెట్లో 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర 10 గ్రాములకు రూ.2,700 పెరిగి రూ.1,22,770 (పన్నులతో సహా)కు చేరుకుంది. మునుపటి సెషన్‌లో ఇది రూ.1,20,000 వద్ద ముగిసింది. వెండి కూడా వెయ్యి రూపాయల పెరుగుదలతో కిలోకు రూ.1,56,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లలో ర్యాలీ
ప్రపంచ బులియన్ మార్కెట్‌లో కూడా ఇదే ధోరణి కొనసాగుతోంది. బంగారం ధర దాదాపు 2 శాతం పెరిగి ఔన్సుకు $3,949.58 వద్ద ఆల్‌టైమ్ హైను తాకగా, వెండి ధర 1 శాతం పెరిగి ఔన్సుకు $48.75 వద్ద నిలిచింది.
అమెరికా ప్రభావం, ఫెడ్ రేట్ల అంచనాలు
నిపుణుల అభిప్రాయం ప్రకారం, అమెరికా పరిపాలనలో ఉన్న ఆర్థిక ప్రతిష్ఠంభన, అలాగే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత తగ్గించవచ్చన్న అంచనాలు బంగారం ర్యాలీకి ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు. ఫలితంగా, బంగారంలో సేఫ్ హేవెన్ ఇన్వెస్ట్మెంట్ మరింత పెరిగింది.
మదుపరుల ఆసక్తి పెరుగుతోంది
దీపావళి సమీపిస్తుండటంతో బంగారం ఆభరణాలపై భారీ డిమాండ్ కనిపిస్తోంది. నగలు, ఇన్వెస్ట్‌మెంట్, గిఫ్ట్ పర్పస్‌లతో మదుపరులు పెద్దఎత్తున కొనుగోళ్లు ప్రారంభించారు. బులియన్ అసోసియేషన్‌లు, జ్యువెలర్స్ ప్రకారం, రాబోయే వారాల్లో మరింత పెరుగుదల అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు.
Also Read : Sebastien lecornu Resign Sensational : ఫ్రాన్స్ కొత్త ప్రధాన మంత్రి సెబాస్టియన్ లెకోర్ను రాజీనామా
