తిరుమల : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రాత్రి అశ్వ వాహనంపై కల్కి అలంకారంలో శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అశ్వ వాహనానికి ముందు గజ రాజులు నడుస్తుండగా, భక్త బృందాల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష, మంగళ వాయిద్యాల నడుమ వాహనసేవ అత్యంత వైభవంగా జరిగింది. విశేష సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ గోవింద నామ స్మరణతో స్వామి వారిని దర్శించుకున్నారు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలతో పోలుస్తాయి. అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడిగా ఈ వాహన సేవ ద్వారా తెలియ జేస్తున్నారు. కృష్ణయజుర్వేదం పరమాత్మను అశ్వ స్వరూపంగా తెలియ జేస్తుంది.
కల్కి స్వరూపంలో అశ్వ వాహనంపై విహరించిన శ్రీ మలయప్ప స్వామివారు కలియుగ దోషాలకు దూరంగా ఉండి, నామసంకీర్తనను ఆశ్రయించి భగవంతుని అనుగ్రహం పొందాలని భక్తులకు ప్రబోధిస్తున్నట్లు ఈ వాహనసేవ అంతరార్థాన్ని తెలియ జేస్తోంది. ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు.
