ప్రత్యేక ఆకర్షణగా జర్మనీ బృందం లక్ష్మీ నృసింహ నృత్యం

19 కళాబృందాల్లో 528 మంది కళాకారుల ప్రదర్శనలు

hellotelugu-TTDCulturals

తిరుమల : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు క‌నుల పండువ‌గా జ‌రుగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా జరిగిన గజవాహన సేవలో దేశ, విదేశాలకు చెందిన కళాకారులు తమ అద్భుత ప్రదర్శనలతో భక్తులను అలరించారు. వివిధ రాష్ట్రాలు, జర్మనీ నుంచి వచ్చిన 19 కళా బృందాలకు చెందిన 528 మంది కళాకారులు గజవాహన సేవలో పాల్గొని తమ కళా ప్రదర్శనలతో తిరుమాడ వీధులకు ప్రత్యేక శోభను తీసుకు వచ్చారు. ఈ ప్రదర్శనల్లో జర్మనీకి చెందిన కళా బృందం ప్రదర్శించిన లక్ష్మీ నృసింహ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జర్మనీలో నివసిస్తున్న భారతీయులు ప్రదర్శించిన ఈ నృత్యం ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయ కళలపై తమకున్న అభిమానం, భక్తి ప్రపత్తులను చాటారు. ఈ ప్రదర్శనను భక్తులు ఆసక్తిగా తిలకించారు.

ఆంధ్రప్రదేశ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలతో పాటు జర్మనీ నుంచి కళాకారులు పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల జానపద, శాస్త్రీయ కళారూపాలను ప్రదర్శిస్తూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కళాకారులు శ్రీనివాస కళ్యాణం, భరతనాట్యం, కోలాటం తదితర కళారూపాలను ప్రదర్శించగా, అస్సాం కళాకారులు తమ ప్రాంతీయ సంప్రదాయ కళను ప్రదర్శించారు. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన కళాకారులు గాలో కళారూపంతో ఆకట్టుకున్నారు. కర్ణాటకకు చెందిన కళాకారులు కథక్, శ్రీ వేంకటేశ్వర వైభవం, యక్షగానం, అర్ధనారీశ్వర పార్వతి శివ కళ్యాణం, జగన్నాథాయ జగన్నాటకం, మూర నృత్యం, కుణిత భజన, కోలాటం తదితర ప్రదర్శనలు ఇచ్చారు. మహారాష్ట్ర కళాకారులు డ్రమ్స్, లెజుమ్ ప్రదర్శనలతో ఉత్సాహాన్ని నింపారు. పాండిచ్చేరికి చెందిన కళాకారులు కరగట్టం ప్రదర్శించారు.

జానపద, శాస్త్రీయ కళల సమ్మేళనంగా సాగిన ఈ ప్రదర్శనలతో తిరుమాడ వీధులు కళామయంగా మారాయి. కళాకారుల నృత్యాలు, వాయిద్య ప్రదర్శనలు, సంప్రదాయ కళారూపాలను భక్తులు ఆసక్తిగా తిలకించారు. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి కళాకారులు పాల్గొని తమ కళా ప్రతిభను ప్రదర్శించడం ద్వారా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లోని ఆధ్యాత్మికతతో పాటు భారతీయ సాంస్కృతిక వైభవం కూడా ప్రతిబింబించింది.

Exit mobile version