తిరుమల : తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. స్వామి వారిని దర్శించు కునేందుకు భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ఈ సందర్బంగా అనంతపురం రేంజ్ ఐజీ ఆధ్వర్యంలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా భక్తిశ్రద్ధలతో సేవలందిస్తున్న శ్రీవారి ఆలయ అర్చకులు, వేద పారాయణదారులు, ఇతర సిబ్బంది, పోటు సిబ్బంది, వాహన బేరర్లు, మేళం సిబ్బందికి వస్త్ర బహుమానం అందించారు ప్రముఖులు.
ఇదిలా ఉండగా నెల్లూరు లోకసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కలిసి ఈ వస్త్ర బహుమానాన్ని అందజేశారు. తిరుమల వైభవోత్సవ మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి చేతుల మీదుగా సిబ్బందికి వస్త్రాలను అందించారు . ఈ సందర్భంగా అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు. శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ప్రతి సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సేవలందించే సిబ్బందికి వస్త్ర బహుమానం అందిస్తున్నారని చెప్పారు.
స్వామివారి సేవలో భాగస్వాములవుతున్న సిబ్బందిని ప్రోత్సహిస్తూ వస్త్ర బహుమానం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీవారి కృపాకటాక్షాలు వేమిరెడ్డి దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని అదనపు ఈవో ఆకాంక్షించారు.
