రామ మందిర విరాళాల దుర్వినియోగం కేసు

25 నాటికి ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్న సిట్

hellotelugu-RamMandhirCase

న్యూఢిల్లీ : అయోధ్య రామాల‌యం విరాళాల దుర్వినియ‌గం కేసుకు సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. 90 రోజుల గడువు సెప్టెంబర్ 25తో ముగుస్తుందని, ఆ తర్వాత నిందితులు ‘డిఫాల్ట్ బెయిల్’ (చట్టపరమైన హక్కుగా లభించే బెయిల్) కోరే అవకాశం ఉందని సుప్రీంకోర్టుకు తెలిపింది సిట్. అయోధ్యలోని రామ మందిరానికి సంబంధించిన విరాళాల దుర్వినియోగంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం తన మొదటి ఛార్జ్‌షీట్‌ను సెప్టెంబర్ 25 నాటికి దాఖలు చేయనుందని సుప్రీంకోర్టుకు సమాచారం అందించారు. ఈ కేసులో జరిగిన మొదటి అరెస్టు నాటి నుండి చట్టపరమైన 90 రోజుల గడువు త్వరలో ముగియనుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా… ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ , న్యాయమూర్తులు జాయ్మాల్య బాగ్చీ, వి. మోహనలతో కూడిన ధర్మాసనానికి వివరించారు. మొదటి అరెస్టు జరిగిన తేదీ నుండి 90 రోజుల గడువు సెప్టెంబర్ 25తో ముగుస్తుంది, కాబట్టి మేము ఛార్జ్‌షీట్ దాఖలు చేయాల్సి ఉంది . లేకపోతే, నిందితులకు డిఫాల్ట్ బెయిల్ లభిస్తుంది అని మెహతా పేర్కొన్నారు.

సిట్ సమర్పించిన సమగ్ర స్థితిగతుల నివేదికను (స్టేటస్ రిపోర్ట్) కూడా అత్యున్నత న్యాయస్థానం పరిశీలించింది అని తెలిపారు. సీఆర్పీసీ లోని సెక్షన్ 167(2) ప్రకారం నిర్ణీత గడువు (60 లేదా 90 రోజులు) లోపు విచారణ సంస్థ ట్రయల్ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయడంలో విఫలమైతే నిందితుడు చట్టపరమైన బెయిల్ (స్టాట్యుటరీ బెయిల్) పొందేందుకు అర్హత సాధిస్తాడు. పాత సీఆర్పీసీలోని సెక్షన్ 167(2) స్థానంలో కొత్త ‘భారతీయ నాగరిక్ సురక్షా సంహిత’ లోని సెక్షన్ 187 అమలులోకి వచ్చింది. దర్యాప్తును వేగంగా పూర్తి చేసి, దానిని తార్కిక ముగింపునకు తీసుకు రావాలని సుప్రీంకోర్టు గతంలో సిట్ ని ఆదేశించింది. విరాళాల చోరీ కేసు దర్యాప్తులో సాధించిన పురోగతిపై సీల్డ్ కవర్‌లో స్థితిగతుల నివేదికను సమర్పించాలని కూడా కోర్టు స్ప‌ష్టం చేసింది.

విరాళాల దుర్వినియోగంపై దర్యాప్తు చేయడానికి ఐజీపీ కిర‌ణ్ నేతృత్వంలో నలుగురు సభ్యుల సిట్ ని ఏర్పాటు చేయడాన్ని సుప్రీంకోర్టు జూలై 27న పరిగణనలోకి తీసుకుంది. దర్యాప్తు బృందంలో ఫోరెన్సిక్ ఆడిటర్‌ను కూడా చేర్చాలని అది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. సవరణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని పేర్కొన్న ధర్మాసనం పారదర్శకతను నిర్ధారించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపింది. రెండు వారాల్లోగా స్థితిగతుల నివేదికను సమర్పించాలని కూడా ధర్మాసనం సిట్ ని ఆదేశించింది.

Exit mobile version