హైదరాబాద్ : తమ న్యాయ పరమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇవాళ చేపట్టిన ఉద్యోగుల ఛలో కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వక పోవడం దారుణమన్నారు మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్. హైద్రాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం బుధవారం తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం అప్రజాస్వామిక చర్య అని మండిపడ్డారు. ఉద్యోగులను భయపెట్టి గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తే అది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలులో కాలయాపన చేస్తోందని ధ్వజమెత్తారు.
ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలకు ఇచ్చిన హామీలు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు. లక్షలాది మంది ఉద్యోగుల సమస్యలను మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో పెట్టి, ఇప్పుడు మరో రెండు సంవత్సరాల పాటు ఏమీ అడగొద్దని చెప్పడం ప్రభుత్వానికి ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఉద్యోగులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నా, ఇప్పటి వరకు అనుమతి ఇవ్వక పోవడం దారుణం అన్నారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి సైతం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహించు కునేందుకు అవకాశం కల్పించామన్నారు శ్రీనివాస్ గౌడ్. కానీ నేడు ఉద్యోగులు తమ సమస్యలను చెప్పుకునేందుకు అనుమతి ఇవ్వక పోవడం దారుణమన్నారు.
ఉద్యోగులు లేకుండా ప్రభుత్వ యంత్రాంగం, పాలన ముందుకు సాగదన్నారు. . ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ఉద్యోగుల ద్వారానే అమలవుతున్నాయని, అలాంటి ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం ఎలా పాలన సాగిస్తుందని నిలదీశారు. ప్రభుత్వం ఎవరి చేతుల్లో ఉంది? ఎవరు నడిపిస్తున్నారు? ప్రజాస్వామ్య పాలన ఎక్కడ ఉంది? అని నిప్పులు చెరిగారు. దేశంలోనే అత్యధికంగా ఆరు డీఏలు బకాయి ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు, ఆశా వర్కర్లు, హోంగార్డులు, పోలీస్ సిబ్బంది, రిటైర్డ్ ఉద్యోగులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వడం లేదన్నారు.
