మొంథా తుపాను నష్టం రూ. 6,352 కోట్లు

అమిత్ షాతో మంత్రులు లోకేష్,అనిత భేటీ

hellotelugu-NaraLokeshAnitha

న్యూఢిల్లీ : మొంథా తుపాను దెబ్బ‌కు ఏపీకి తీవ్ర న‌ష్టం వాటిల్లింద‌ని రాష్ట్ర స‌ర్కార్ పేర్కొంది. ఈ మేర‌కు ఇందుకు సంబంధించిన నివేదిక‌ను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర‌షాకు అంద‌జేశారు మంత్రులు నారా లోకేష్, వంగ‌ల‌పూడి అనిత‌. రాష్ట్రంలో అన్నిరంగాలకు కలిపి రూ.6,352 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు. న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంత్రులు లోకేష్, అనిత లు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన న‌ష్టం గురించి ఏక‌రువు పెట్టారు. తుపాను కారణంగా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనడమే కాకుండా మౌలిక సదుపాయాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. మొంథా తుపాను వల్ల మొత్తం 3,109 గ్రామాలు ప్రభావితమయ్యాయని పేర్కొన్నారు. అక్టోబర్ 28వ తేదీ రాత్రి కాకినాడ సమీపంలో తుపాను తీరం దాటింది. ఆ సమయంలో గంటకు 100 కి.మీ. వేగంతో గాలులతో భారీ వర్షం కురవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే అప్రమత్తమై 1.92 లక్షల మందిని 2,471 పునరావాస శిబిరాలకు తరలించింది. వారికి అవసరమైన ఆహారం, తాగునీరు, పాలు, ఇతర వస్తువులను అందించిన‌ట్లు తెలిపారు. ప్రతి ప్రభావిత కుటుంబానికి తక్షణ సాయంగా రూ.3వేలు అందించామ‌న్నారు నారా లోకేష్, అనిత వంగ‌ల‌పూడి. ఇదే సమయంలో, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కూలిన చెట్ల తొలగింపు, తాత్కాలిక నివాస సౌకర్యాలు, నీటి సరఫరా పునరుద్ధరణ వంటి పలు చర్యలను చేపట్టిందన్నారు. తక్షణ సహాయం కింద రూ.60 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.271 కోట్లు, గృహ నష్టం రూ.7 కోట్లు, రహదారులు, మౌలిక సదుపాయాలకు రూ.4,324 కోట్లు, విద్యుత్ రంగానికి రూ.41 కోట్లు, నీటి వనరులు, నీటిపారుదల ప్రాజెక్టులకు రూ.369 కోట్లు, శాశ్వత నిర్మాణాలకు రూ.1,302 కోట్లు, సామూహిక ఆస్తులకు రూ.48కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. మొత్తం రూ.6,356 కోట్ల నష్టంలో NDRF మార్గదర్శకాల ప్రకారం రూ.902 కోట్లు తక్షణ ఉపశమనం క‌లిగించామ‌న్నారు.

Exit mobile version