అమరావతి : బంగాళా ఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్. మరోసారి కోనసీమకు పెనుముప్పు వాటిల్లనుందన్నారు. కోరంగి, ఉప్పాడ తీరాలకు ఉప్పెన ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. కాకినాడకు దక్షిణంగా మచిలీపట్నంకు ఉత్తరంగా తీరం దాటుతుందని పేర్కొన్నారు. కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. 3 కి.మీ వేగంతో ఆక్వాన్ తుపాన్ కొద్ది గంటల్లో తీవ్ర తుపాన్‌గా మారే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తుపాన్ కేంద్రీకృతమై ఉందన్నారు. ప్రస్తుతానికి చెన్నైకి 600కి.మీ, మచిలీపట్నానికి 650 కి.మీ, విశాఖపట్నానికి 660 కి.మీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 780 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు. గడిచిన 6 గంటల్లో గంటకి 3 కిమీ వేగంతో తుపాను కదులుతోందన్నారు ఇవాళ తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందన్నారు ఎండీ.
పశ్చిమ-వాయవ్య దిశలో ప్రయాణిస్తూ రేపు ఉదయానికి అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందన్నారు . శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు – విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు.
రైతులు వ్యవసాయ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు ప్రఖర్ జైన్ . రాష్ట్రంలో అన్ని ప్రధాన పోర్టులకు గ్రేట్ డేంజర్ సిగ్నల్ 1 జారీ చేయాలని సూచించారు. ప్రధానంగా 19,20 తేదీల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. తుపాను సమస్యల పరిష్కారం కోసం ‘మన మిత్ర’ వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా, అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లు 112, 1070, 18004250101 ను సంప్రదించాలని ప్రఖర్ జైన్ కోరారు.
