న్యూ ఢిల్లీ : మున్నూరు కాపులను రాజకీయంగా, సామాజికంగా అణిచి వేసేందుకు పాలక ప్రభుత్వ వర్గాల స్థాయిలోనే కుట్రలు ప్రారంభమయ్యాయని, వీటిని తక్షణమే తిప్పి కొట్టకపోతే కుల సమాజ ఉనికికే ప్రమాదం అని అన్ని పార్టీల మున్నూరు కాపు నేతలు స్పష్టం చేశారు. తమ హక్కులను కాపాడు కునేందుకు, తమ మీద జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనేందుకు,. పార్టీలకు, భావజాలాలకు అతీతంగా, తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపులంతా ఐక్యం కావలసిన అత్యవసర పరిస్థితి తలెత్తిందిందని అన్నారు. రాజకీయంగా, సామాజికంగా అణచివే యడానికి, ఆధిపత్య పాలక వర్గాలనుండి, మున్నూరు కాపుల మీద జరుగుతున్న ఉద్దేశ పూర్వక దాడులను, వివక్షపూరిత ధోరణులను తీవ్రంగా తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని కుల పెద్దలు స్పష్టం చేశారు.
ఈ మేరకు.. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డా. కే .లక్ష్మణ్ పటేల్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పటేల్ , బిఆర్ఎస్ పార్టీ ఎంపీ, రాజ్య సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర పటేల్ , కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వి హనుమంత రావు పటేల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు టీ పీ సి సి ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్ పటేల్, వంటి ప్రముఖులు, తదితర కుల పెద్దలతో మున్నూరు కాపు ఫౌండేషన్ ట్రస్ట్ బాధ్యులు సమావేశమయ్యారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం మున్నూరు కాపు ఆత్మ గౌరవ భవన నిర్మాణం కోసం కోకాపేటలో ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించిన సంగతి తెలిసిందే. మున్నూరు కాపు ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ స్థలంలో ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
కాగా ఆర్థిక వనరులు తదితర సమన్వయ లోపాల కారణంగా పనులు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో, భవన్ నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు ఫౌండేషన్ ట్రస్ట్ బాధ్యుల ఆధ్వర్యంలో రెండు రోజుల ఢిల్లీ పర్యటన జరిగింది. ఈ సందర్భంగా మున్నూరు కాపు ఆత్మ గౌరవ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయడంతో పాటు, కులం ఎదుర్కొంటున్న సమస్యల విస్తృతమైన చర్చలు జరిపారు.త్వరలోనే కుల పెద్దలు , శ్రేయోభిలాషులు, దాతలు తదితరులతో సమావేశమై, భవన నిర్మాణం పనులను వేగవంతం చేయాలని నిర్ణయించారు.

















