ధ‌ర్మ‌పురి ఆల‌య పున‌ర్ నిర్మాణం : డిప్యూటీ సీఎం

గోదావరి పుష్క‌రాల కోసం రూ. 22.16 కోట్లు మంజూరు

hellotelugu-DeputyCM

క‌రీంన‌గ‌ర్ జిల్లా : రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భట్టి విక్ర‌మార్క‌, మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్ తో క‌లిసి సోమ‌వారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణం , సమగ్ర అభివృద్ధి పనుల కోసం శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించి, శంకుస్థాపన చేశారు. ఆలయ పునర్నిర్మాణం కోసం ఇప్పటికే కేటాయించిన రూ. 117 కోట్లకు అదనంగా మరో రూ. 80 కోట్లను సమకూర్చడం జ‌రిగింద‌ని ఈ సంద‌ర్బంగా చెప్పారు డిప్యూటీ సీఎం. మొత్తం రూ. 200 కోట్ల వ్యయంతో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దేందుకు తాము సంక‌ల్పించ‌డం జ‌రిగింద‌ని అన్నారు.

అనంతరం స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకుల నుండి వేద ఆశీర్వచనాలను స్వీకరించారు. అంతేకాకుండా రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్థం రూ. 22.16 కోట్లతో కొత్త ఘాట్ల నిర్మాణం, రూ. 2.48 కోట్లతో తిమ్మాపూర్‌లో విద్యుత్ సబ్-స్టేషన్ నిర్మాణం చేప‌ట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు భ‌ట్టి విక్ర‌మార్క‌. మొత్తం రూ. 58.55 కోట్ల విలువైన 9 కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన‌ట్లు తెలిపారు. చారిత్రక ధర్మపురి పుణ్యక్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా పరిపుష్టంగా, పర్యాటక అనుకూలంగా, సర్వ విధాలా అందంగా తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో కృషి చేస్తోందని స్ప‌ష్టం చేశారు.

రాబోయే రోజుల్లో దేశంలో కుంభ‌మేళా నిర్వ‌హించిన విధంగానే త‌మ ప్ర‌భుత్వం కూడా గోదావ‌రి పుష్క‌రాల‌ను అత్యంత వైభ‌వోపేతంగా నిర్వ‌హించునున్న‌ట్లు ప్ర‌క‌టించారు ఉప ముఖ్య‌మంత్రి. త‌మ స‌ర్కార్ ఆల‌యాల అభివృద్ది కోసం కృత నిశ్చ‌యంతో ఉంద‌న్నారు.

Exit mobile version