అమరావతి : ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో నష్టపోతున్న మామిడి రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీమా భరోసా కల్పిస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి మామిడి పంటకు వాతావరణ ఆధారిత పంటల బీమా పథకంతో పాటు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులు ఎకరాకు గరిష్ఠంగా రూ.35 వేల వరకు బీమా రక్షణ పొందే అవకాశం ఉంది. ఇందుకోసం రైతులు ఎకరాకు రూ.1,650 నుంచి రూ.2,250 వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. బీమాలో చేరేందుకు డిసెంబర్ 31వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. బీమా నిబంధనల ప్రకారం ప్రీమియం చెల్లించి నమోదు చేసుకున్న రైతులకు నిర్దేశిత వాతావరణ ప్రతికూలతల వల్ల పంట నష్టం జరిగితే నిబంధనల మేరకు పరిహారం అందుతుంది.
చివరి తేదీ వరకు వేచి చూడకుండా డిసెంబర్ 31లోగా బీమా నమోదు పూర్తి చేసుకోవాలని ఉద్యాన శాఖ అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని వివరాలు, సందేహాల నివృత్తి కోసం సంబంధిత మండల ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించాలని కోరారు. రైతులు తమ స్మార్ట్‌ఫోన్‌లోని ‘PMFBY Crop Insurance Farmer’ యాప్ ద్వారా నేరుగా నమోదు చేసుకోవచ్చు. లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్లు, బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, అధీకృత బీమా ప్రతినిధులను సంప్రదించవచ్చు. గ్రామ, మండల ఉద్యాన శాఖ అధికారులు, రైతు సేవా కేంద్రాల సహాయకుల ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి రైతులు తమ ఆధార్ కార్డు, బ్యాంక్ పాసు పుస్తకం జిరాక్స్ , భూమి పట్టాదారు పాస్‌బుక్ లేదా 1బీ నకలు., పంట సాగు చేస్తున్నట్లు స్వీయ ధ్రువీకరణ పత్రం. కౌలు రైతులకు కౌలు గుర్తింపు పత్రంతో పాటు మొబైల్ నంబర్, పాస్‌పోర్టు సైజు ఫొటో జత చేయాలని కోరారు.
