అమరావతి : వ్యవసాయం, ఆక్వా, హార్టికల్చర్ రంగాలకు సంబంధించిన సేవలన్నింటినీ ఒకే యాప్ పరిధిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రైతులకు అవసరమైన సమాచారం, సాగు సూచనలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఒకే వేదిక ద్వారా అందుబాటులోకి తేవాలని తెలిపారు. రైతు సేవా కేంద్రాల నుంచి క్షేత్రస్థాయి సమాచారం సేకరించి ఏడాది పొడవునా రాష్ట్రంలో పచ్చదనం ఉండేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అగ్రివాచ్పై ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించి, దాని సమర్థ వినియోగంపై అధికారులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. రాష్ట్రంలో పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు. మేకలు, గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించి పశుసంపదను పెంచాలని, వీబీ-జీ రామ్-జీ పథకాన్ని పశుసంపద అభివృద్ధికి ఏ మేరకు వినియోగించుకోవచ్చో అధ్యయనం చేయాలన్నారు.
ఈ ఏడాది ఖరీఫ్‌లో ఎల్‌నినో కరువు పరిస్థితులు, అర్నబ్, మురసు తుఫాన్లు, భారీ వర్షాల కారణంగా 26 జిల్లాల్లో మొత్తం 12.64 లక్షల హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు వివరించారు. ఇందులో 9.67 లక్షల హెక్టార్లలో ఎల్‌నినో కరువు ప్రభావంతో పంటలు దెబ్బతిన్నాయి. అర్నబ్ తుఫాను కారణంగా 13 జిల్లాల్లో 3.82 లక్షల మంది రైతులకు చెందిన పంటలు దెబ్బతినగా, మురసు తుఫాను ప్రభావంతో 9 జిల్లాల్లో 52,402 మంది రైతులకు చెందిన పంటలకు నష్టం వాటిల్లింది. తుఫాన్ల కారణంగా దెబ్బతిన్న పంట నష్టం వివరాలతో నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా దెబ్బతిన్న పంటలకు మొత్తం రూ.2,743 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని అధికారులు ప్రతిపాదించారు.
రాష్ట్రంలో 11.55 లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణం పంటల బీమా పరిధిలో ఉందని అధికారులు తెలిపారు. నష్టపోయిన పంటలకు రూ.1,732 కోట్ల బీమా క్లెయిమ్‌లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు. ప్రతి రైతు బీమా పరిధిలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. బీమా కింద ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు బీమా పరిహారం కూడా అందే అంశంపై సమగ్ర అవగాహన కల్పించాలని తెలిపారు. డిజి రైతు బజార్ ప్రారంభించాక ఇప్పటికి లక్షకు పైగా ఆర్డర్లకు పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు. అలాగే మొబైల్ రైతు బజార్లు వచ్చే ఫిబ్రవరి కల్లా మరో 40 పెంచనున్నట్టు వివరించారు. ఈ సమీక్షలో వ్యవసాయ, ఉద్యాన శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
