అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా, గోదావరి డెల్టా సహా వివిధ ప్రాంతాల్లో పంటలకు సాగునీటిపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. పంట తెగుళ్లను నియంత్రించేలా పురుగు మందుల వినియోగం ఏమేరకు రాష్ట్రంలో తగ్గించగలిగామో అంచనా వేయాలని సీఎం స్పష్టం చేశారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించి మైక్రో న్యూట్రియంట్లను పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. యుద్ధ ప్రభావం నేపథ్యంలో రసాయన ఎరువుల లభ్యత పై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో ప్రకృతి సేద్యం వైపుగా రైతుల్ని ప్రోత్సహించాలన్నారు. నేచురల్ ఫార్మింగ్ పై వ్యవసాయ విశ్వ విద్యాలయాలకు చెందిన ప్రోఫెసర్లు, విద్యార్ధులు కూడా క్షేత్రస్థాయికి వెళ్లి అధ్యయనం చేసేలా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని అధికారులకు సీఎం నిర్దేశించారు.
వ్యవసాయ యాంత్రీకరణ పై క్లస్టర్ల వారీగా ప్రణాళికలు చేపట్టటంతో పాటు రైతు సాధికార సంస్థ ద్వారా హార్వెస్టర్లు, విత్తన యంత్రాలు, ఇతర పరికరాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. ఫార్మర్ యాప్ ద్వారా అన్ని అంశాలనూ ఇంటిగ్రేట్ చేయాలని డ్రోన్లు, ఫార్మింగ్ యంత్రాల వినియోగం మరింత పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాయలసీమ ప్రాంతాన్ని ఉద్యాన హబ్ గా మార్చేందుకు రూ.40 వేల కోట్లతో పూర్వోదయ పథకం అమలులో భాగంగా సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల కనెక్టివిటీ, గోదాములు సహా మౌలిక సదుపాయాల నిర్మాణంతో పాటు రూ.60 వేల కోట్ల ప్రైవేటు పెట్టుబడులతో అభివృద్ధి చేయనున్నట్టు సీఎం వివరించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరాపల్లి సమీపంలో యడవోలు వద్ద కోకో సిటీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. జూలై నాటికి మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కు శంకుస్థాపన చేయనున్నట్టు సీఎం వెల్లడించారు. పశు దాణాతో పాటు సైలేజ్ ను తక్కువ వ్యయానికే అందుబాటులోకి తేవటంతో పాటు తీవ్ర ఉష్ణోగ్రత కారణంగా పౌల్ట్రీలో కోళ్లు చనిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాయలసీమలో అరటికి కోల్డ్ స్టోరేజి సౌకర్యం కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
