హైదరాబాద్ : అతి తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి హడ్కో చైర్మన్ ను కోరారు . తమ సర్కార్ కీలకమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిందన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్ మెట్రో రైల్ ఎక్స్‌టెన్షన్, ఆర్‌ఆర్‌ఆర్, రేడియల్ రోడ్ల నిర్మాణానికి తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు అందించాలని తనను మర్యాద పూర్వకంగా కలిసిన హడ్కో చైర్మన్ సంజయ్ కుల శ్రేష్టకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన మౌలిక సదుపాయాలు , అభివృద్ధి ప్రాజెక్టులకు ఊతం ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన కీలక సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హడ్కో) లిమిటెడ్ చైర్మన్‌కు భారత్ ఫ్యూచర్ సిటీ నుండి బెంగళూరు , అమరావతి మీదుగా చెన్నై వరకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్ల నిర్మాణం, బందర్ పోర్టుకు గ్రీన్‌ఫీల్డ్ హైవే, ప్రతిపాదిత హై-స్పీడ్ రైలు కారిడార్ గురించి ప్రత్యేకంగగా వివరించారు.
ప్రధానంగా ముఖ్యమంత్రి రుణ పునర్నిర్మాణ అంశాన్ని హడ్కో చైర్మన్ దృష్టికి తీసుకు వచ్చారు, గత BRS ప్రభుత్వం తీసుకున్న రుణాలపై అధిక వడ్డీ రేట్లపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సదర్బంగా సీఎం చేసిన ప్రతిపాదనలకు హడ్కో చైర్మన్ సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు అధిక వడ్డీ చెల్లింపు సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతున్నందున, కొత్త ప్రాజెక్టులకు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు అందించాలని రేవంత్ రెడ్డి అభ్యర్థించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పటికే రుణాలు మంజూరు చేశామని, మరో 10 లక్షల ఇళ్ల నిర్మాణానికి రుణాలను వెంటనే విడుదల చేయడానికి సానుకూలంగా స్పందించామని కులశ్రేష్ఠ రేవంత్ రెడ్డికి తెలియజేశారు.
