అమరావతి : ఆకస్మిక వరదలు, వర్షాలతో విల విల లాడుతోంది నేపాల్ దేశం. ఇదిలా ఉండగా ఆ దేశాన్ని సందర్శించేందుకు పలువురు భారత దేశానికి చెందిన పర్యాటక ప్రేమికులు వెళ్లారు. చాలా మంది వరదల్లో చిక్కుకు పోయారు. దీంతో భారత ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేశాయి. ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నాయి. ప్రత్యేక అధికారులను నియమించారు. ఇందులో భాగంగా నేపాల్ వరదల్లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ వాసుల పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు చేపట్టిన సహాయక చర్యల గురించి ఆయన ఆరా తీశారు. నేపాల్ వరదల్లో రాష్ట్రానికి చెందిన 41 మంది చిక్కుకుపోయినట్లు గుర్తించామని, వారిలో 34 మంది సురక్షితంగా ఉన్నారని, మిగిలిన ఏడుగురి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు సీఎంకు తెలిపారు. మానసరోవర్ యాత్రకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ వాసుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తున్నట్లు వారు వివరించారు.
టిబెట్ ప్రాంతంలో కర్నూలు-ఆదోని ప్రాంతానికి చెందిన నలుగురు యాత్రికులు, ఖాఠ్మండులో తిరుపతి ప్రాంతానికి చెందిన 28 మంది యాత్రికులు సురక్షితంగా ఉన్నారని వారు పేర్కొన్నారు. చిత్తూరు, విజయవాడ, కాకినాడ , గుంటూరు ప్రాంతాలకు చెందిన ఏడుగురు వ్యక్తులు కనిపించకుండా పోయారని వారు తెలిపారు. సమాచారాన్ని నిరంతరం సేకరించేందుకు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఒక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని, కేంద్ర ప్రభుత్వం అలాగే ఖాఠ్మండు , చైనాలోని రాయబార కార్యాలయాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా, రోడ్డు, వాయు మార్గాలు , ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వారిని సురక్షితంగా తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ వాసులను సురక్షితంగా వారి సొంత ప్రాంతాలకు తీసుకు రావడమే అత్యంత ప్రాధాన్యత అని, ఇందుకోసం అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంలో ఎటువంటి జాప్యం జరగకూడదని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ తాజా వివరాలను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని ఆయన ఆదేశించారు.
