CM Chandrababu : అమరావతి – రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమారవతి క్వాంటం వాలీ లో క్యూపిఐఏఐ భాగస్వామ్యం కానుంది. నేషనల్ క్వాంటం మిషన్‌లో భాగంగా దేశంలోనే తొలిసారిగా అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటం వ్యాలీలో క్యూపీఐఏఐ కూడా భాగస్వామ్యం వహించనుందని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు (CM Chandrababu). దీనిలో అధునాతన 8 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుకు క్యూపిఐఏఐ సంస్థ ముందుకు వచ్చింది.
CM Chandrababu Meet Quantam Valley Founder
ఈ అంశంపై ఆ సంస్థ వ్యవస్థాపకులు నాగేంద్ర నాగరాజన్‌తో సీఎం చర్చించారు. ప్రజల ప్రయోజనాల కోసం ఉపకరించే ఆవిష్కరణలు, అలాగే, విద్యార్ధుల పరిశోధనలకు ఉపయోగపడేలా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. దీనితో పాటు అమరావతిలో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి క్యూపిఐఏఐను (QPIAIS) కోరారు. తద్వారా విద్యార్ధులు, పరిశోధకులు, స్టార్టప్‌లు క్వాంటం అల్గారిథంలు, అప్లికేషన్‌లను రూపొందించు కునేందుకు అవకాశం ఏర్పడుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో వివిధ పంటల సాగులో కచ్చితత్వం, తెగుళ్లకు సంబంధించిన అంశాలను అంచనా వేసేందుకు క్వాంటం కంప్యూటింగ్ ఉపకరించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అదే సమయంలో వ్యవసాయ ఉత్పత్తి పెరిగేలా సూచనలు, సలహాలను సకాలంలో ఇవ్వటం ద్వారా రైతుల ఆదాయాలను మెరుగు పడేందుకు ఈ సాంకేతికత దోహద పడాలని సీఎం పేర్కోన్నారు. రాష్ట్రంలో నీటి వనరులను సమర్ధంగా నిర్వహించేందుకు వీలుగా క్వాంటం టెక్నాలజీని వాడాలన్నారు.
వ్యాధుల నిర్ధారణ, మెడికల్ లాజిస్టిక్స్ తదితర అంశాల్లోనూ క్వాంటం సిమ్యులేషన్‌ను సమర్ధంగా వినియోగించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. యువతకు నైపుణ్యాలను కల్పించే అంశంలోనూ క్వాంటం టెక్నాలజీ సహకారాన్ని తీసుకునేలా ప్రభుత్వం యోచన చేస్తోంది. క్వాంటం లాంటి ఆధునిక సాంకేతికత ద్వారా సామాన్య ప్రజల సామాజిక, ఆర్ధిక పరిస్థితుల్ని మెరుగు పర్చేలా ప్రభుత్వం కార్యాచరణ చేస్తోంది. విద్య, పరిశోధన, ఇన్నోవేషన్ రంగాల్లో డీప్ టెక్ ద్వారా సమాజానికి విస్తృత ప్రయోజనాలు కల్పించటమే లక్ష్యంగా క్యూపిఐఏఐ, నేషనల్ క్వాంటం మిషన్, అమరావతి క్వాంటం వ్యాలీ పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
Also Read : YS Sharmila – Liquor Scam : లిక్కర్ స్కాం సంగతేమిటో తేల్చండి – షర్మిల

















