అమరావతి : రాయలసీమ సమగ్ర ఉద్యానవన అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ను ప్రతిపాదించామని సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రిలయన్స్ సంస్థ భాగస్వామ్యంతో ఐఎస్ఏ ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. వ్యవసాయ ఆవిష్కరణల్లో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ఇది పనిచేస్తుందని వెల్లడించారు. వ్యవసాయ రంగంలో ఏఐ, డిజిటల్ అగ్రికల్చర్, వాతావరణ సుస్థిరత లాంటి అంశాలపై దృష్టి్ సారించేలా ఈ సంస్థను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. క్లైమేట్-స్మార్ట్ అగ్రికల్చర్, డిజిటల్ ఫార్మింగ్, పోస్ట్-హార్వెస్ట్ సిస్టమ్స్, గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్‌లో అత్యాధునిక పరిశోధనలను ప్రోత్సహించేలా ఐఎస్ఐ పని చేస్తుందన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్, అగ్రిటెక్ లాంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా ఈ సంస్థ కీలకంగా పనిచేస్తుందని అన్నారు.
రిలయన్స్ గ్రూప్ యాంకర్ భాగస్వామిగా స్టార్టప్, ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్లను ఏర్పాటు చేస్తుందన్నారు సీఎం. జాన్ డీర్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఎన్విడియా, నెస్లే, కార్గిల్ లాంటి అంతర్జాతీయ కంపెనీల నుంచి పరిశోధనా సహకారాన్ని కూడా తీసుకోనున్నట్టు సీఎం తెలిపారు. ఎంబీఏ అగ్రికల్చర్ లీడర్షిప్, డిజిటల్ అగ్రికల్చర్ లో మాస్టర్స్, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ లాంటి ప్రపంచ స్థాయి కోర్సులను అందించేలా దీనిని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఆగస్టు 3 తేదీన రిలయన్స్ గ్రూప్ తో ఐఎస్ఏ ఏర్పాటుపై ఎంఓయూ కుదుర్చుకోనున్నామని.. సంస్థ ఏర్పాటుకు అవసరైన భూమిని కూడా గుర్తించినట్టు సీఎం తెలిపారు. విద్యా బోధనతో పాటు ఏపీ అగ్రికల్చరల్ ట్రాన్సఫర్మేషన్ కు ఓ మేధోమథన కేంద్రంగా ఆవిష్కరణలకు ఇంజిన్ గా ఐఎస్ఏ పనిచేస్తుందని సీఎం తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక సంస్థ ఏర్పాటులో తోడ్పాటు అందించాలని ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరారు.

















