China : అమెరికా భారతదేశంపై విధించిన 50 శాతం సుంకాల నిర్ణయంపై చైనా బహిరంగంగా భారత్‌కు అండగా నిలిచింది. ఈ విషయంపై భారతదేశంలోని చైనా రాయబారి జు ఫీహాంగ్ గురువారం (ఆగస్టు 21) అధికారికంగా స్పందించారు.
China Strong Reaction to America
“అమెరికా భారతదేశంపై 50 శాతం వరకు సుంకం విధించింది. ఇంకా మరిన్ని సుంకాలు పెంచుతామని బెదిరిస్తోంది. ఈ చర్యలను చైనా (China) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. భారత్‌తో (India) మేము దృఢంగా నిలుస్తాము” అని ఆయన స్పష్టం చేశారు.
అమెరికా తన వాణిజ్య విధానాలను బేరసారాల సాధనంగా వాడుకుంటోందని జు ఫీహాంగ్ విమర్శించారు. స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో లాభాలు పొందుతున్న వాషింగ్టన్, ఇప్పుడు దేశాలపై ఒత్తిడి తెచ్చే పద్ధతిగా సుంకాలను వాడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. మౌనం వహిస్తే మరింత దౌర్జన్యానికి దారితీస్తుందని, అందుకే చైనా గట్టిగా ప్రతిస్పందిస్తోందని రాయబారి తెలిపారు.
అలాగే భారత మార్కెట్ అవకాశాలపై కూడా ఆయన వ్యాఖ్యానించారు. “చైనా మార్కెట్‌లో భారతీయ ఉత్పత్తులకు మరింత స్థలం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. భారత్ ఐటీ, సాఫ్ట్‌వేర్, బయోమెడిసిన్ రంగాల్లో బలంగా నిలుస్తోంది. చైనా ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధన రంగాల్లో వేగంగా ఎదుగుతోంది. రెండు దేశాల మార్కెట్లు కలిస్తే విశ్వవ్యాప్తంగా మరింత ప్రభావం చూపవచ్చు” అని ఫీహాంగ్ అన్నారు.
భారతీయ కంపెనీలు చైనాలో పెట్టుబడులు పెట్టాలని తమ దేశం కోరుకుంటోందని, అలాగే చైనా సంస్థలకు భారతదేశం మరింత అనుకూల వాతావరణం కల్పిస్తే పరస్పర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇక అమెరికా తాజాగా కొన్ని భారతీయ వస్తువుల దిగుమతులపై 50 శాతం భారీ సుంకం విధించాలని ప్రకటించింది. ఇందులో 25 శాతం పరస్పర సుంకం, రష్యా నుంచి చమురు కొనుగోలుపై మరో 25 శాతం సుంకం ఉన్నాయి. రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకోవడం ద్వారా ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్ష మద్దతు లభిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ సుంకాలు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి.
Also Read : Huge Price Drops – Auto Mobile : భారీగా తగ్గనున్న కార్ల, ఆటోమొబైల్ వస్తువుల ధరలు
