హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ లో చోటు చేసుకన్న తొక్కిసలాట కేసుకు సంబంధించి శనివారం పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఇందుకు సంబంధించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ వివరాలు వెల్లడించారు. జన సమూహ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, థియేటర్ యాజమాన్యం, ఈవెంట్ నిర్వాహకులు, ప్రైవేట్ భద్రతా సిబ్బంది సంబంధిత ఇతరుల మధ్య సమన్వయంలో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని వెల్లడించారు.
మొత్తం 23 మందిపై చార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలిపారు. వీరిలో 14 మందిని అరెస్టు చేయగా, ముందస్తు బెయిల్ పొందిన తొమ్మిది మంది నిందితులకు నోటీసులు జారీ చేశామన్నారు. నిందితులలో సంధ్య 70ఎంఎం థియేటర్ భాగస్వాములు, సిబ్బంది, ఈవెంట్ నిర్వాహకులు, ప్రైవేట్ భద్రతా సిబ్బంది, బౌన్సర్లు ,ఈ సంఘటనకు సంబంధించిన ఇతరులు ఉన్నారని చెప్పారు. వీరిలో నటుడు అల్లు అర్జున్ , అతని మేనేజ్‌మెంట్, భద్రతా బృంద సభ్యులు కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా ఛార్జిషీట్ దాఖలు చేయడంపై అల్లు అర్జున్ ఫ్యామిలీ ఇంత వరకు స్పందించ లేదు. అప్పట్లో బన్నీపై కేసు నమోదు చేసి, అరెస్ట్ కూడా చేశారు. తను బెయిల్ పై బయటకు వచ్చారు. తను హీరో అయినా అరెస్ట్ తప్పదంటూ అసెంబ్లీ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
