హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కార్ చేసిన 420 మోసాల గురించి శాసన సభలో నిలదీయాలని దిశా నిర్దేశం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గండిపేటలోని గోల్కొండ రిసార్ట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఓరియంటేషన్ సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈసారి కాంగ్రెస్ పెడుతున్న బడ్జెట్ సమావేశాలకు అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. ఇప్పటికే సగం ప్రభుత్వ పదవీ కాలం అయి పోయిందన్నారు. హామీల అమలులో ప్రజలు ఇచ్చిన వ్యవధి దాటి పోయిందని, అయినా ఇంకా నమ్మించి మోసం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు కేటీఆర్.
వారి హామీల అమలు వైఫల్యాన్ని, మోసాన్ని ఎండగట్టేందుకు ఈ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, చేస్తున్న అరాచకాలపై ఈ అసెంబ్లీ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడం జరిగిందని చెప్పారు. పార్టీ సీనియర్ నేతలు మధుసూదనాచారి, బండా ప్రకాష్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి తో పాటు ఇతరులు కూడా విలువైన సూచనలు చేశారన్నారు కేటీఆర్. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినా అసెంబ్లీలో ఏ కమిటీలను వేయక పోవడం దారుణమన్నారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని ఆవేదన వ్యక్తం చేశారు.
