Brinjal : వంకాయ ఆరోగ్యానికి పలు విధాలుగా మేలు చేస్తుందని తెలిసిన విషయమే. అయితే అందరికీ ఇది సమానంగా ఉపయోగపడకపోవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొంతమందిలో వంకాయ వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశముందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
Brinjal – అలర్జీ సమస్యలు
వంకాయ (Brinjal) నైట్‌షేడ్ మొక్కల కుటుంబానికి చెందుతుంది. టమాటాలు, బంగాళాదుంపలు, పెప్పర్స్ కూడా ఇదే వర్గానికి చెందినవి. ఈ రకపు కూరగాయలు కొందరికి అలర్జీని కలిగించవచ్చు. ముఖ్యంగా చర్మ సమస్యలు, జీర్ణకోశ సమస్యలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అలర్జీ ఉన్నవారు వంకాయ తినేటప్పుడు జాగ్రత్త వహించడం అవసరం.
కిడ్నీ సమస్యలు
వంకాయలో ఉండే ఆక్సాలేట్స్ అనే రసాయనాలు కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి. ఇప్పటికే ఈ సమస్యతో బాధపడుతున్నవారు వంకాయను ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు.
జీర్ణ సమస్యలు
వంకాయలో అధికంగా ఉండే పీచు పదార్థం కొందరికి జీర్ణకోశంపై ఒత్తిడిని కలిగిస్తుంది. ఫలితంగా కడుపుబ్బరం, విరేచనాలు వంటి సమస్యలు రావచ్చు.
మందులతో ప్రతికూల ప్రభావం
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నివేదిక ప్రకారం, వంకాయలో ఉండే టైరమైన్ అనే పదార్థం కొన్ని ప్రత్యేక ఔషధాల (మోనోఅమైన్ ఆక్సిడేస్ ఇన్‌హిబిటర్స్) ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీని వలన డిప్రెషన్ సమస్యలు మరింత పెరగడం, రక్తపోటు అస్థిరంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
రక్తహీనతపై ప్రభావం
వంకాయలో ఉండే నాసునిన్ అనే కాంపౌండ్ ఆహారంలోని ఐరన్‌ను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటుంది. అందువల్ల రక్తహీనతతో బాధపడుతున్నవారు వంకాయ తినడంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇతర జాగ్రత్తలు
కొంతమంది వంకాయ తిన్న తర్వాత కీళ్ల నొప్పులు పెరుగుతున్నాయని చెబుతున్నారు. అయితే దీనిపై స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు ఇంకా లభించలేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అలాగే గర్భిణులు వంకాయ వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు.
Also Read : Indian Railways Interesting Offer : ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన రైల్వే శాఖ
