హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గా ఉన్న మీనాక్షి నటరాజన్ పార్లమెంట్ సభ్యురాలిగా పోటీలో నిలిచేందుకు సిద్దమయ్యారు. కాంగ్రెస్ పార్టీకి 63 మంది ఎమ్మెల్యేల బలగం ఉంది. మొత్తం 3 సీట్లకు గాను 2 సీట్లు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉండగా మిగతా సీటు కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే మీనాక్షి నటరాజన్ ఎంపీ సీటు కోసం నామినేషన్ దాఖలు చేసింది. ఆమె సమర్పించిన అఫిడవిట్ లో వాస్తవాలను దాచి పెట్టిందని బీజేపీ ఆరోపించింది.
దీంతో తన నామినేషన్ చెల్లదని, తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు దారితీసిన బీజేపీ కుట్రను తాను ఖండిస్తున్నట్లు తెలిపారు సీఎం. ‘ఓట్ల చోరీ’ ‘SIR’ (సర్వేల పేరుతో డేటా సేకరణ) తర్వాత, ఇప్పుడు వారు ‘సీట్ల చోరీ’కి పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు.ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. ప్రజల గొంతుకను అణచి వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత ప్రజాస్వామ్యానికి ఇది ఒక చీకటి రోజు అని పేర్కొన్నారు. పౌరులందరూ దీనిని ఖండించాలని సీఎం పిలుపునిచ్చారు. తాడో పేడో కోర్టులో తాము తేల్చుకుంటామని ప్రకటించారు రేవంత్ రెడ్డి.
