హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లె రాజేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గద్దర్ అవార్డుల ప్రకటనపై మండిపడ్డారు. ఏ ప్రాతిపదికన అవార్డులను ప్రకటించారో ఎంపిక జ్యూరీ కమిటీ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా, “కోట కట్టలేను గాని కళ్ళలో నిన్నే దాచుకుంటా” అనే పాట వల్లే రాజు వెడ్స్ రాంబాయి సినిమా హిట్ అయిందని చెప్పారు పల్లె రాజేశ్వర్ రెడ్డి.
ఆ సినిమాకి గద్దర్ అవార్డు ఇస్తే సినిమాలోని ఐదుగురు ఆంధ్ర వాళ్ళకే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కాని ఈ పాట రాసిన తెలంగాణ ఉద్యమకారుడు, దళిత బిడ్డ మిట్టపల్లి సురేందర్‌కు కానీ, హీరోకు అవార్డు ఇవ్వ లేదని సంచలన ఆరోపణలు చేశారు. ప్రధానంగా పేరుకే తెలుగు చలన చిత్ర పరిశ్రమ కానీ అంతా ఆంధ్రా వాళ్లే ఆధిపత్యం చెలాయిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ సారథ్యంలో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కళాకారులు, రచయితలు, కవులు, గాయనీ గాయకులకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత లభించిందని అన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పనిగట్టుకుని తెలంగాణ వారి పట్ల వివక్ష చూపుతోందని ధ్వజమత్తారు పల్లె రాజేశ్వర్ రెడ్డి.
