ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల తయారీకి ఏపీ అనుకూలం

సింగపూర్‌ పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు

helloteluugu-APCM

సింగపూర్ : సంస్కరణలతో భారత్ దూసుకుపోతున్న ఆర్ధిక శక్తిగా మారిందని, ఇందులో ఆంధ్రప్రదేశ్ కీలక చోదక శక్తిగా ఎదుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. చైనా లాంటి దేశాలు ఆర్ధిక వృద్ధికి దశాబ్దాల కాలం పట్టిందని.. భారత్‌కు అంత సమయం అవసరం లేదని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఆధునిక ఆలోచనలు, సంస్కరణలతో భారత్‌ను అద్భుతమైన వేగంతో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. సింగపూర్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి తొలిరోజు సోమవారం వెంచర్ క్యాపిటలిస్టులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. మెడికల్ టెక్నాలజీ సహా ఆధునిక పరికరాల తయారీలో భారత్ ఇప్పుడు అగ్రస్థానంలో ఉందన్నారు. వివిధ రకాల ఎలక్ట్రానిక్స్ పరికరాలు ఇప్పుడు భారత్ నుంచి ఎగుమతి అవుతున్నాయని అన్నారు. డెమోగ్రాఫిక్ డివిడెండ్‌తో అతిపెద్ద యువశక్తి ఉన్న మానవ వనరుల దేశంగా భారత్ నిలిచిందన్నారు.

భారత్ తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో 5వ జనరేషన్ ఫైటర్ జెట్‌లు సహా వివిధ రక్షణ రంగ ఉత్పత్తులు తయారు చేసేలా ప్రాజెక్టులు ఏర్పాటు అవుతున్నాయని సీఎం వివరించారు. మెడికల్ టెక్నాలజీ, ఇతర ఆధునిక పరికరాల తయారీలో భారత్ అగ్రస్థానంలో ఉందన్నారు. తయారీ రంగాన్ని ప్రోత్సహించేలా ఆంధ్రప్రదేశ్‌లో వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ అనే విధానాన్ని అనుసరిస్తున్నామని సీఎం తెలిపారు. ఏపీకి అడ్వాన్స్ డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (AMCA), గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ లాంటి పరిశ్రమలకు వేగంగా అనుమతులు, భూములు కేటాయించామని ముఖ్యమంత్రి వారికి వివరించారు. ఏపీలో వివిధ పారిశ్రామిక ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ఇదే సరైన సమయం అని.. పెట్టుబడిదారులు ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు.

శ్రీసిటీ లాంటి ప్రత్యేక పారిశ్రామికవాడలు పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని అన్నారు. ఏపీలో పౌరసేవలతో పాటు అన్ని అంశాలకూ టెక్నాలజీని అనుసంధానించాం అన్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా పెట్టుబడులకు ఆస్కారం ఉందన్నారు. వెంచర్ క్యాపిటలిస్టులు ఆర్టీఐహెచ్ ప్రోత్సహించిన స్టార్టప్‌లకు పెట్టుబడులు అందించే అవకాశం ఉందని తెలిపారు. అత్యుత్తమ ఆవిష్కరణల్ని పోత్సహించేందుకు వెంచర్ కాపిటలిస్టులు ముందుకు రావాలని కోరుతున్నానని సీఎం అన్నారు. ఈ సమావేశానికి ఆరిజన్ వెంచర్స్, ఆటోమోనిక్స్, ఏలెవ్ 8 వెంచర్స్, ఆప్టిమమ్ సొల్యూషన్స్, క్వోనా కాపిటల్, జంగిల్ వెంచర్స్ తదితర వెంచర్ క్యాపిటల్ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.

Exit mobile version