AP Govt : అమరావతి – విజన్, పీపుల్, నేచర్, టెక్నాలజీలకు ప్రాధాన్యత ఇచ్చి పాలన చేస్తే అత్యుత్తమ ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) అన్నారు. నాణ్యమైన జీవన ప్రమాణాలను సాధించే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించు కోవాలని సీఎం సూచించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పై ప్రణాళికా శాఖతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. తలసరి ఆదాయం పెంచడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలని అన్నారు. 2025-26 ఆర్ధిక సంవత్సరంలో తలసరి ఆదాయం రూ. 3,47,871 సాధించాలని, దానికి అనుగుణంగా 2029 నాటికి రూ. 5.42 లక్షలు తలసరి ఆదాయం వచ్చేలా లక్ష్యంగా పెట్టుకోవాలని దిశానిర్దేశం చేశారు.
AP Govt New Updates
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలు ఆయా రంగాల్లో ముందస్తు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్నారు. స్వల్ప, మధ్య, దీర్ఘ కాలిక లక్ష్యాలకు అనుగుణంగా విజన్ తో పనిచేయాలని అన్నారు. ప్రపంచం పోకడలను గమనిస్తూ అవకాశాలను అందు కోవాలన్నారు. . ప్రజలను, సమాజాన్ని, కుటుంబాలను, వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు అమలు చేయాలని చెప్పారు సీఎం. ఫ్యామిలీ ఒక యూనిట్ గా తీసుకుని పథకాలు, కార్యక్రమాలు రూపొందించాలన్నారు… కనీస అవసరాలు అందించాలి. పథకాలతో పాటు వారి ఆదాయాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలి. పర్యావరణానికి మేలు చేసే విధంగా ప్రభుత్వ విధానాలు, ప్రజల ఆలోచనలు ఉండాలని స్పష్టం చేశారు.
సహజ వనరులను రక్షించుకుంటూ ప్రకృతిని కాపాడుకోవాలి. ఒక పరిశ్రమలో తయారైన వేస్ట్ మరో పరిశ్రమకు ముడి సరుకు అయ్యేలా చేసి సర్క్యులర్ ఎకానమీకి నాంది పలకాలి. సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలి. అత్యుత్తమ టెక్నాలజీని పాలనకు అనుసంధానించి మెరుగైన సేవలు అందించాలి. ఆరోగ్యం నుంచి వ్యవసాయం వరకు టెక్నాలజీని భాగస్వామి చెయ్యాలి. ప్రజల కోసం.. విజన్ రూపొందించుకుని పర్యావరణం దెబ్బతినకుండా చూసుకుంటూ టెక్నాలజీని అనుసుంధానం చేస్తూ పాలన సాగిస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు నారా చంద్రబాబు నాయుడు.
Also Read : CM Revanth Reddy – Upasana Konidela Proven : చిరంజీవి కోడలు ఉపాసనకు కీలక బాధ్యతలు
