హైదరాబాద్ : కన్నడ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి రుక్మిణి వసంత్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. తను ఇప్పటికే పలు చిత్రాలలో నటించి మెప్పించింది. ప్రస్తుతం దమ్మున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న డ్రాగన్ చిత్రంలో తను కీ రోల్ పోషిస్తోంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ హీరో పాత్ర పోషిస్తున్నాడు. ఇక డ్రాగన్ లో చోటు దక్కించుకున్న ఈ కన్నడ భామకు మరో తెలుగు మూవీలో నటించేందుకు ఛాన్స్ దక్కినట్లు సినీ వర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా టాలీవుడ్‌లో అడుగు పెట్టక ముందే తెలుగు చిత్రసీమలో తన ఉనికిని చాటుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ‘డ్రాగన్’ చిత్రంలో తెలుగులో అరంగేట్రం చేయనున్న ఈ ప్రతిభావంతురాలైన నటి, ఇప్పుడు నటుడు-నిర్మాత నాని నిర్మాణంలో రాబోయే చిత్రంలో కీలక పాత్ర కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
నానికి సంబంధించి ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్‌పై, ‘దండోరా’ చిత్ర దర్శకుడు మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో కథానాయికగా నటించేందుకు ఆమెను సంప్రదించినట్లు సినీ వర్గాల సమాచారం. అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉన్నప్పటికీ, ఆమె ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంతకం చేసినట్లు తెలుస్తోంది. కన్నడ రొమాంటిక్ డ్రామా ‘సప్త సాగర దాచే ఎల్లో’లో తన అద్భుతమైన నటనతో రుక్మిణి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆమె సహజమైన నటన, స్క్రీన్ ప్రెజెన్స్ దక్షిణాది అంతటా ప్రశంసలు పొందాయి, దీనివల్ల ఆమె పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న యువ నటీమణులలో ఒకరిగా నిలిచారు. ఆమె కీలక పాత్ర పోషించిన ‘కాంతార’ చిత్రం సాధించిన విజయం తెలుగు ప్రేక్షకులలో ఆమె ప్రజాదరణను మరింత పెంచింది.
