హైదరాబాద్ : పేదల దేవుడు మాజీ సీఎం అంజయ్య అని కొనియాడారు ఎంపీ ఈటల రాజేందర్. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం చిన్న తోకట్ట (న్యూ బోయిన్‌పల్లి) లోని జి.ఎం. అంజయ్య మెమోరియల్ హిందూ శ్మశాన వాటికలో నూతనంగా నిర్మించిన ‘గ్రానైట్ స్టోన్ స్టేడియం సీటింగ్ షెడ్’ ను ప్రారంభించి ప్రసంగించారు. చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో అంజయ్య, గుడిసెల వెంకటస్వామి వంటి పెద్దల పేర్లు వినేవాడిని అన్నారు. నాటి రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా దేశం నలుమూలల నుండి పొట్టచేత పట్టుకుని హైదరాబాద్ వచ్చిన లక్షలాది మంది పేదలకు 30, 40 గజాల స్థలాలు ఇచ్చి, ఇండ్లతో కూడిన బస్తీలు నిర్మించి ఆదుకున్న గొప్ప చరిత్ర వారిదన్నారు. ఈనాటి ముఖ్యమంత్రులు ఆనాడు ఉంటే గుడిసెల అంజయ్య, గుడిసెల వెంకటస్వామి వంటి వాళ్ళు ఉండేవారు కారు.
పేదల కోసం ఇంత గొప్పగా కృషి చేసిన జి.ఎం. అంజయ్య పేరు మీద ఉన్న శ్మశాన వాటికలో సదా కేశవ రెడ్డి నూతన సీటింగ్ షెడ్‌ను నిర్మించడం ఎంతో అభినందనీయం అన్నారు. మనిషికి ఎంత సంపద ఉందన్నది కాదు, సమాజంలో ఎంత గౌరవం ఉందనేదే ముఖ్యమని పేర్కొన్నారు. చాలామంది దగ్గర డబ్బు ఉన్నప్పటికీ, ఇలాంటి సేవా కార్యక్రమాలకు దానం చేసే మనసు కొందరికే ఉంటుందన్నారు. గతంలో ‘సత్తన్న’ అనే వ్యక్తి అంత్యక్రియల కోసం ఇక్కడకు వచ్చినప్పుడు శ్మశాన వాటిక దుస్థితిని చూసి కేశవరెడ్డి నేను మాట్లాడుకున్నామని తెలిపారు. తాను ఎంపీ అయిన తర్వాత ఇక్కడి సెంట్రల్ లైటింగ్, స్మశాన వాటికల అభివృద్ధి, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం కోసం నిధులు కేటాయించానని చెప్పారు.
ఇటీవల కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ ని కలిసినప్పుడు కంటోన్మెంట్ భూముల (B1, B2, B3, B4) సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు ఈటల రాజేందర్. ఈ భూములన్నీ తెలంగాణ ప్రజలకు చెందినవేనని, మిలట్రీ అవసరాల కోసం ఆనాడు ఇచ్చారని స్పష్టం చేశారు. ఒకప్పుడు సుందరంగా, గార్డెన్లతో విరాజిల్లే కంటోన్మెంట్ ఇవాళ ప్రజలను వేధించే ప్రాంతంగా మారుతోందని, మారిన పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలు సవరించాలని వారికి విజ్ఞప్తి చేశానని తెలిపారు.
