Adani Group : దేశవ్యాప్తంగా వాణిజ్య రంగాల్లో శక్తివంతంగా ఉన్న అదానీ గ్రూప్ ఇప్పుడు ఆరోగ్య సేవల రంగంలోకి ప్రవేశించింది. ఈ మేరకు ముంబయి, అహ్మదాబాద్ నగరాల్లో అత్యాధునిక సదుపాయాలతో రెండు భారీ ఆస్పత్రులను నిర్మించేందుకు కసరత్తులు ప్రారంభించింది.
Adani Group New Innovation
ముంబయిలో ఇటీవల జరిగిన ఒక సదస్సులో అదానీ గ్రూప్ (Adani Group) చైర్మన్ గౌతమ్ అదానీ ఈ ప్రకటన చేశారు. “మేము ఆరోగ్యరంగంలో అనుభవాన్ని పెంచే దిశగా దృష్టి సారిస్తున్నాం. అత్యాధునిక సాంకేతికత, కృత్రిమ మేధ (AI) ఆధారిత వైద్య విధానాలతో సరసమైన ధరల్లో మెరుగైన వైద్యం అందించేందుకు ఈ ఆస్పత్రులు ప్రారంభించబోతున్నాం” అని ఆయన వెల్లడించారు.
ఈ ఆస్పత్రుల్లో రోగ నిర్ధారణ నుంచి చికిత్స వరకు అన్నింటికీ కృత్రిమ మేధ ఉపయోగించనున్నారు. అనేక రకాల వ్యాధులకు ఒకే స్థలంలో సమగ్ర చికిత్స అందించే విధంగా ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు. అత్యవసర పరిస్థితులు, కోవిడ్ వంటి మహమ్మారి సందర్భాల్లో ఆస్పత్రుల సామర్థ్యాన్ని వేగంగా విస్తరించే వీలున్న విధంగా వీటిని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
అందుబాటు ధరల్లో వైద్యం లక్ష్యం
సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఖర్చులను తగ్గించడమే తమ ప్రధాన లక్ష్యమని గౌతమ్ అదానీ స్పష్టంగా చెప్పారు. దేశంలో ఉన్న ఆరోగ్య అసమానతలను తగ్గించడానికి, ప్రతి ఒక్కరికి సమర్థవంతమైన వైద్యం అందించడానికి తమ గ్రూప్ కృషి చేస్తోందని తెలిపారు.
ఇప్పటికే విద్యుత్, మౌలిక సదుపాయాలు, రవాణా, డేటా, పునరుత్పాదక శక్తి రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అదానీ గ్రూప్, ఇప్పుడు ఆరోగ్య రంగంలోనూ అదే స్థాయిలో ప్రభావాన్ని చూపాలని లక్ష్యంగా పెట్టుకుంది. త్వరలో ఆస్పత్రుల నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
