హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ వర్దమాన నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు. శనివారం హైదరాబాద్ బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాం చందర్ రావు, కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డిల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. నటి ఆమనితో పాటు మరికొందరు బీజేపీలో చేరారు. 1990వ దశకంలో ఆమని కీలకమైన నటిగా పేరు పొందారు. అగ్ర నటులతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. తాను నటించిన శుభ సంకల్పంకు జాతీయ స్థాయిలో అవార్డు పొందారు. కమల్ హాసన్ , అక్కినేని నాగార్జున, రాజేంద్ర ప్రసాద్, తదితర నటులతో కలిసి పలు సినిమాలలో నటించి మెప్పించారు.
ఎన్నో విజయవంతమైన చిత్రాలలో తను ముఖ్య భూమిక పోషించారు. ఆ తర్వాత కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. తిరిగి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి ఆ నలుగురు సినిమాలో పునరావృతం చేశారు. ఇదే క్రమంలో అప్పటి నుంచి నేటి దాకా సహాయ పాత్రలలో నటిస్తూ వచ్చారు నటి ఆమని. తెలుగు, తమిళ సీరియల్స్, రియాల్టీ షోలలో కూడా నటించారు. ఈ సందర్బంగా పార్టీ చీఫ్ కె. రామచందర్ రావు మాట్లాడుతూ నటి ఆమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం నచ్చి బీజేపీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో సినీ రంగానికి చెందిన మరికొందరు కూడా తమ పార్టీలో చేరబోతున్నారని ఆయన సంచలన ప్రకటన చేశారు. అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు రాంచందర్ రావు.
