హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లకు మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా ‘మెగా గ్రోత్ కారిడార్ల’ కోసం ఏకీకృత అభివృద్ధి ప్రణాళికలను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం కార్పొరేషన్ల కోసం అభివృద్ధి చేస్తున్న గ్రోత్ కారిడార్ తెలంగాణ భవిష్యత్తుకు అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. తదనుగుణంగా, ఈ మూడు నగరాలకు ఔటర్ రింగ్ రోడ్లను నిర్మించాలని సూచించారు.
రాష్ట్రంలో మెగా గ్రోత్ కారిడార్ అభివృద్ధి , వాటి ప్రణాళికలపై ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి భవనంలో
మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖకు చెందిన సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో ప్రతిపాదిత మెగా గ్రోత్ కారిడార్ల అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించిఅధికారులకు పలు సూచనలు చేశారు.మహబూబ్‌నగర్, భూత్‌పూర్, జడ్చర్లను కలుపుతూ ఒక గ్రోత్ కారిడార్‌ను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. కొత్తగూడెం, పాల్వంచ , సుజాతానగర్‌లను కలిపి ఒక గ్రోత్ కారిడార్‌ను ఏర్పాటు చేయాలన్నారు సీఎం.
నల్గొండ, యాదాద్రి మధ్య ఒక ‘టెంపుల్ కారిడార్’ను, అలాగే ఆదిలాబాద్, నాగోబా, బాసర, కడెం ప్రాజెక్టులను కలుపుతూ ఒక ‘పర్యాటక కారిడార్’ను ఏర్పాటు చేయాలన్నారు రేవంత్ రెడ్డి. కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఆలంపూర్ జోగులాంబ ఆలయ అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. సింగరేణి పరిధిలోని అన్ని మున్సిపాలిటీలను ఒకే యూనిట్‌గా అభివృద్ధ చేస్తే బాగుంటుందన్నారు. సింగరేణి సంస్థ తన సీఎస్ఆర్ నిధులను స్థానికంగానే ఖర్చు చేయాలన్నారు.
