చెన్నై : తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ కుప్పుస్వామి అన్నామలై బీజేపీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆమోదించారు. ఈ మేరకు బీజేపీ శుక్రవారం అధికారంగా వెల్లడించింది. ఈ నెల 2 న పార్టీ జాతీయ అధినేతకు రాజీనామా సమర్పించాడు.. తర్వాత అగ్రనేత అమిత్ షా ను కలిసి తాను పార్టీ వీడటానికి గల కారణాలను వివరించాడు.మొత్తం మీద రెండు రోజుల తర్వాత ఆయన రాజీనామాను ఆమోదిస్తూ పార్టీ లేఖ విడుదల చేసింది. తాజాగా కె. అన్నామలై లేఖలోని మొదటి పేజీ బయటకు వచ్చింది. ఇప్పుడది పెద్ద చర్చకు దారితీసింది.
జాతీయ రాజకీయ పార్టీల పెద్దలు ప్రజలకు అర్థమయ్యే భాషలో మాట్లాడ కపోవడం పెద్ద ప్రతిబంధకమని గుర్తించక పోవడం దారుణమన్నారు. స్థానికంగా ఎదగాలంటే.. ముందుగా ప్రజలకు ఏ భాష వచ్చో ఆ భాషలో స్పష్టంగా మాట్లాడితేనే వారికి మనం ఏఏం చెప్పదలుచు కున్నామో తెలుస్తుందని పేర్కొన్నాడు లేఖలో. ఒక ఆలోచన.. మార్పు..చైతన్యం తీసుకు రావాలంటే.. భాషనే అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు. ఈ విషయంలో తాను ప్రయత్నం చేసినప్పటికీ బీజేపీ పెద్దలు పెట్టించు కోలేదని వాపోయాడు కె . అన్నామలై. అంతే కాదు స్థానిక ప్రజలు ఏం కోరుకుంటున్నారు.. వారి ఆకాంక్షలు జీవనశైలి..ఔన్నత్యం.. ఆత్మగౌరవం.. ఇలాంటివన్నీ (లోకల్ సెంటిమెంట్) పట్టించు కోకుండా ఉంటే ప్రజాభిమానం గెలుచుకోలేమని కుండ బద్దలు కొట్టాడు కె. అన్నామలై. దక్షిణాదిలో హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయడం తగదని కూడా హితవు పలికారు.
రాష్ట్ర ప్రజలు అనేక దశాబ్దాలుగా సాగుతున్న సాధారణ రాజకీయ చర్చలతో విసిగి పోయారు. మార్పు కోసం ఆరాటపడ్డారు. గత దశాబ్దంలో పలుమార్లు మార్పు వచ్చింది, కానీ అది నిలదొక్కుకోలేక ప్రజల జ్ఞాపకాల నుండి త్వరగా మాయమై పోయింది. జాతీయ పార్టీలు తమిళనాడు ప్రజలకు అర్థమయ్యే భాషలో ఎప్పుడూ మాట్లాడలేదు. నేను ఈ నమ్మకాన్ని మార్చడానికి ప్రయత్నించాను . లోపల, బయట నుండి అనేక అడ్డంకులు, అవరోధాలు ఎదురైనప్పటికీ, చెప్పుకోదగ్గ విజయాన్ని కూడా సాధించానని తెలిపాడు కె. అన్నామలై.
ప్రాంతీయ ఆకాంక్షలలో లోతుగా పాతుకు పోయిన ఒక జాతీయవాదిగా, నా భాష గొప్పతనం, నా సంస్కృతి వైవిధ్యం , నా ప్రాంతం విశిష్ట వారసత్వం పట్ల నేను అపారమైన గర్వాన్ని పొందుతున్నాను. బలమైన, ఐక్య భారతదేశం దానిలోని అనేక ప్రాంతాలు, వర్గాల బలం, గౌరవం , ఆకాంక్షలపై నిర్మించ బడుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. తమిళనాడులో అభివృద్ధి ఆధారిత, సాంస్కృతిక మూలాలున్న రాజకీయాల భవిష్యత్ కార్యాచరణపై నా ఆలోచనలతో అగ్ర నాయకత్వాన్ని మరింత భారం చేయాలని నేను కోరుకోవడం లేదు. మన సీనియర్ నాయకత్వంతో జరిపిన సంభాషణల అనంతరం, తమిళనాడు విషయంలో మన అభిప్రాయాలు ఏకీభవించడం లేదనే నిర్ధారణకు నేను వచ్చాను . అందుకే పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు కుప్పుస్వామి అన్నామలై.
