విశాఖపట్నం జిల్లా : ఏపీ సర్కార్ పెట్టుబడిదారులకు గ్రాండ్ వెల్ కమ్ చెబుతోందని తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇదే సమయంలో ప్రతి కుటుంబంలో ఒకరు పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. వివాఖ సీఐఐ సదస్సు 2026లో ఆయన పాల్గొని ప్రసంగించారు. విశాఖలో ఐటీ, డేటా సెంటర్లు, హాస్పిటాలిటీ రంగాల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయని తెలిపారు. 58కి పైగా దేశాల ప్రతినిధులు, 15 మంది విదేశీ మంత్రులు ఈ భాగస్వామ్య సదస్సుకు హాజరయ్యారు. రష్యా, జపాన్, యూరప్ తదితర ప్రాంతాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాం. ఎంఎస్ఎంఈ ఎగ్జిబిషన్లో ఒక సంస్థ భారీ యంత్ర పరికరాల తయారీతో పాటు క్వాంటం కంప్యూటింగ్కు అవసరమైన విడిభాగాలను కూడా తయారు చేస్తోందన్నారు సీఎం. ఇది రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక ప్రతిభకు నిదర్శనం. పెట్టుబడుల ఒప్పందాలు, ఉద్యోగాల కల్పన ఒక లక్ష్యమైతే.. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే మా ప్రధాన ధ్యేయం అని మరోసారి ప్రకటించారు.
ఈ సందర్బంగా ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మంత్రి లోకేష్ మాట్లాడుతూ…ముందుగా మనపై మనకు నమ్మకం ఉండాలి. ప్రతికూల అభిప్రాయాలను పట్టించు కోకుండా లక్ష్యం వైపు సాగాలి. కొత్త ఆలోచనలను మొదట్లో సమాజం వ్యతిరేకించవచ్చు. అయితే మారేకొద్దీ సానుకూలత లభిస్తుంది. వైఫల్యాన్ని ఎదుగుదలలో భాగంగా స్వీకరించాలి. వైఫల్యం ఎదురైతే సమాజం ఏమనుకుంటుందోనన్న భయాన్ని అధిగమించాలి అని పిలుపునిచ్చారు. FAIL అంటే ‘First Attempt In Learning’. ప్రతి ప్రయత్నం నుంచి నేర్చుకుంటూ మానసికంగా దృఢంగా ఎదగాలి. ఈ విషయంలో చంద్రబాబు ని యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. పాతికేళ్ల వయసులో ఎమ్మెల్యే కావాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకుని అనుకున్నది సాధించారని అన్నారు. హెరిటేజ్ ఫుడ్స్ ప్రారంభానికి ముందు ఆయన చేసిన మూడు వ్యాపార ప్రయత్నాలు విఫలమైనప్పటికీ వెనక్కి తగ్గలేదని చెప్పారు నారా లోకేష్, స్వయంగా నిలదొక్కుకుని వ్యాపారాన్ని నిర్మించాలన్న లక్ష్యాన్ని వదులు కోలేదన్నారు. అదే పట్టుదలను రాజకీయాల్లోనూ కొనసాగించారని పేర్కొన్నారు. లక్ష్యాన్ని సాధించాలనే తపన, కష్టాలను అధిగమించే పట్టుదల ఉండాలన్నారు.



















