న్యూఢిల్లీ : మావోయిస్టు హింస వల్ల గిరిజనులే అత్యధికంగా నష్ట పోయారని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గత ప్రభుత్వాలు మూగ ప్రేక్షకులుగా ఉండి పోయాయని ఆరోపించారు. మావోయిస్టు హింస వల్ల గిరిజన సమాజాలు తీవ్రంగా నష్ట పోయాయని, గత ప్రభుత్వాలు వారి హక్కులను విస్మరించాయని విమర్శించారు. అదే సమయంలో నక్సలిజాన్ని అంతం చేసేందుకు , గిరిజన అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. ఆదివారం జరిగిన సజన జాతీయ గౌరవ దివస్’ కార్యక్రమంలో వర్చువల్ పద్ధతిలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. గత ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గిరిజన సమాజాల హక్కులను మావోయిస్టులు లాగేసుకుంటున్నప్పుడు, గత పాలకులు వారిని పట్టించు కోకుండా వదిలేశారని ఆయన ఆరోపించారు. దేశంలో మావోయిజాన్ని అంతం చేసే దిశగా సాధించిన పురోగతిని ప్రస్తావించిన ఆయన, ఈ విజయం పట్ల గిరిజన తల్లులు, సోదరీమణులు ప్రభుత్వానికి ఆశీస్సులు అందిస్తున్నారని పేర్కొన్నారు.
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశం సాధించిన రెండు కీలక విజయాలను గుర్తు చేశారు. మొదటిద దేశంలో దాదాపు 50 కోట్ల మంది ప్రజలు తీవ్ర పేదరికం నుండి బయట పడటం. రెండవది నక్సలిజం అంతం కావడం మావోయిస్టు ఉగ్రవాదం నుండి విముక్తి లభించడం . ఈ రెండు విజయాలు మన గిరిజన సోదర సోదరీమణుల జీవితాలతో లోతుగా ముడిపడి ఉన్నాయి అని ఆయన అన్నారు. గడ్చిరోలి వంటి గిరిజన ప్రాంతాల ప్రజలకు, మావోయిస్టు హింస వల్ల గిరిజన సమాజమే అత్యధికంగా నష్ట పోయిందనే విషయం బాగా తెలుసని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 2014 నాటికి దేశంలోని సుమారు 125 జిల్లాలు మావోయిజం ప్రభావంతో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. గతంలో ప్రతి ఏటా వందలాది హింసాత్మక ఘటనలు జరిగేవి. వేలాది మంది అమాయకులు, వారిలో అధిక సంఖ్యలో గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. అయితే నక్సలిజం-మావోయిజం వల్ల ప్రభావితమైన ప్రజలను అప్పటి ప్రభుత్వాలు గాలికొదిలేశాయి, వారి హక్కులను హరించాయి, అందరూ మౌనంగా ఉండిపోయారు అని ఆయన అన్నారు.


















