అమరావతి : వైసీపీ పాలనలో జగన్ రెడ్డి ఏపీని సర్వ నాశనం చేశాడని సంచలన ఆరోపణలు చేశారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుబాష్. ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎండీ ఫరూక్ తో కలిసి హాజరయ్యారు సుభాష్ . మంత్రి మాట్లాడుతూ వైసీపీ పాలనలో విధ్వంసం, అరాచకం, భయాందోళనలు పెరిగితే.. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, ప్రజల్లో నమ్మకం పెరిగాయని అన్నారు. జగన్ ఓ సైకోలా రాష్ట్రాన్ని నడిపారు.. చంద్రబాబు నాయుడు ఓ విజనరీగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్మిస్తున్నారు అని మంత్రి వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని మంత్రి అన్నారు. పార్టీ కోసం కార్యకర్తలు చేసిన త్యాగాలను టీడీపీ ఎప్పటికీ మరచి పోదని, వారి కష్టానికి గౌరవం ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు.
కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని పిలుపునిచ్చారు. ప్రజలు గత పాలనకు, ప్రస్తుత పాలనకు మధ్య తేడాను స్వయంగా విశ్లేషించాలని కోరారు . కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. గత పాలకులు సంక్షేమం పేరుతో రోడ్ల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని, కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని రహదారుల రూపురేఖలను మారుస్తోందని చెప్పారు. డ్వాక్రా సంఘాల ఉత్పత్తులకు ‘స్వయం’ పేరుతో బ్రాండింగ్ కల్పించి మహిళలకు ఆర్థికంగా మరింత బలం చేకూర్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. మహిళలు, యువత, కార్మికులు, రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు.
గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో ప్రజల్లో భూములపై అనిశ్చితి సృష్టించిందని మంత్రి విమర్శించారు. ప్రస్తుతం ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమం ద్వారా ప్రతినెలా 9వ తేదీన రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తున్నామని తెలిపారు. భూ కబ్జాలకు అడ్డుకట్ట వేసి బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. మెగా డీఎస్సీ నిర్వహణను అడ్డుకునేందుకు వందలాది పిటిషన్లు దాఖలైనా వాటన్నింటినీ ఎదుర్కొని ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టిందని మంత్రి చెప్పారు.
















