అమరావతి : నాణ్యమైన వైద్యం ప్రతి ఒక్కరి హక్కు అనే గొప్ప ఆశయాన్ని ఆచరణలో సాకారం చేస్తూ పిఠాపురం నియోజకవర్గాన్ని సమగ్ర, అత్యున్నత ఆరోగ్య సేవలకు కేంద్రంగా, రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచే మోడల్ హెల్త్ హబ్‌గా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీర్చి దిద్దుతున్నారు. ప్రతి పేదవాడికీ ఎలాంటి ఆర్థిక భారం లేకుండా, అత్యున్నత ప్రమాణాలతో కూడిన కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు ఉచితంగా అందాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఈ మహత్తర లక్ష్య సాధనలో భాగంగా ఆధునిక సదుపాయాలతో ఆసుపత్రుల అభివృద్ధి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతం, ఆయుష్ వైద్య సేవల విస్తరణతోపాటు వైద్య విద్యా సంస్థల ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. దీనితోపాటు రోగుల ప్రయాణ సౌకర్యార్థం ఈ ఆసుపత్రులన్నింటికీ కనెక్టింగ్ రోడ్లను కూడా నిర్మించారు.
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీకి అనుగుణంగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధతో పిఠాపురంలోని 30 పడకల పాత కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను రూ.34 కోట్ల అంచనా వ్యయంతో 100 పడకల సామర్థ్యంతో కూడిన అత్యాధునిక ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ పనులు యుద్ధ ప్రాతిపాదికన సాగుతుండగా, ఇప్పటికే దాదాపు 50 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 4.67 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ అత్యాధునిక ఆసుపత్రిలో ఆధునిక ఐసీయూ, అధునాతన వైద్య పరీక్షా ప్రయోగశాలలు, ఆధునిక ఆపరేషన్ థియేటర్లు, 30 పడకల ప్రసూతి విభాగంతోపాటు చిన్నపిల్లల వైద్యం, కంటి వైద్యం, ఎముకల వైద్యానికి సంబంధించిన ప్రత్యేక విభాగాలు అందుబాటులోకి రానున్నాయి. ఆసుపత్రి నిర్మాణం పూర్తై ప్రజలకు అందుబాటులోకి వస్తే పిఠాపురం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లోని ఆరు మండలాలకు చెందిన సుమారు 3 లక్షల మంది ప్రజలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఉచిత, కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయి.
ఆసుపత్రికి అనుబంధంగా బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ భవనం, మార్చురీ, లక్ష లీటర్ల సామర్థ్యం గల సంప్‌తోపాటు ఇతర అవసరమైన మౌలిక సదుపాయాల నిర్మాణం కూడా చేపడుతున్నారు. ప్రతిష్టాత్మక ప్రభుత్వ ఆయుష్ మెడికల్ కాలేజీ ఏర్పాటు పిఠాపురం పేరును వైద్య విద్యా రంగంలో ప్రత్యేకంగా నిలబెట్టే లక్ష్యంతో, నేషనల్ ఆయుష్ మిషన్ కింద ప్రతిష్టాత్మక ప్రభుత్వ ఆయుష్ వైద్య కళాశాల ఏర్పాటుకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సుమారు రూ.100 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ఆయుష్ మెడికల్ కాలేజ్‌తోపాటు అనుబంధ అభివృద్ధి పనుల కోసం పిఠాపురం నియోజకవర్గంలో భూసేకరణ పనులు వేగవంతం చేశారు. ఈ కళాశాల నిర్వహణ, అనుబంధ సేవలు, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరగనున్నాయి.
















