వైఎస్సార్ కడప జిల్లా : కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆగస్టు 23 నుంచి 26వ తేదీ వరకు అష్టబంధన మహా సంప్రోక్షణ కుంభాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు టీటీడీ జేఈవో డాక్టర్ ఏ. శరత్ వెల్లడించారు. ఏర్పాట్లకు సంబంధించి జేఈవో అధికారులతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. ఏర్పాట్లపై ఆరా తీశారు. మహా సంప్రోక్షణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంజినీరింగ్, విద్యుత్ పనులను త్వరగా పూర్తి చేయడంతో పాటు విద్యుత్ దీపాలు, పుష్పాలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించాలన్నారు. ధ్వజస్తంభం, బలిపీఠానికి సంబంధించిన ఇత్తడి రేకు పనులను 21లోగా పూర్తి చేయాలని సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.
ఆలయానికి చేరుకున్న జేఈవోకు అర్చకులు సాంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణ అనంతరం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం జేఈవో ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ స్వామి వారి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. క్యూలైన్లు, పోటు, యాగశాల, ప్రసాదాల పంపిణీ తదితర భక్తుల సౌకర్యాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు జేఈవో. అనంతరం టీటీడీ నిర్మించనున్న 100 గదుల వసతి సముదాయం కోసం కేటాయించనున్న స్థలాన్ని, కల్యాణ వేదిక వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో సీఈ మనోహరం, డిప్యూటీ ఈవో ఎ. ప్రశాంతి, శ్రీమతి సుమతి, డిప్యూటీ ఈఈ నాగరాజు, ఆలయ ఏఈవో ఎన్. రవి, సూపరింటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు ఈశ్వర్ రెడ్డి, మోహన్ బాబు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.



















