నల్లగొండ జిల్లా : రాష్ట్ర వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురవాలని దేవతలను ప్రార్థిస్తూ ప్రభుత్వం నిర్వహించిన ఈ మహా వరుణ యజ్ఞం అత్యంత భక్తిశ్రద్ధలతో, వేద పండితుల మంత్రోచ్ఛారణలు మరియు పవిత్ర వేద విధులతో శాస్త్రీయమైన ఖచ్చితత్వంతో పూర్తయింది. నాగార్జున సాగర్‌లోని విజయ్ విహార్ సమీపంలో కృష్ణా నదీ తీరంలో నిర్వహించిన వరుణ యజ్ఞంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో పాటు ఆయన సతీమణి పాల్గొన్నారు. వారు రుత్వికుల మార్గదర్శకత్వంలో యజ్ఞ విధులను నిర్వహించి, పూర్ణాహుతిని సమర్పించారు.
యాదగిరి గుట్ట లోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో వరుణ దేవుని అనుగ్రహం కోసం 108 మంది రుత్వికులు, 11 హోమ గుండాలతో వేద సంప్రదాయానుసారం హోమం కార్యక్రమాలు జరిగాయి. ఈ పవిత్ర యజ్ఞంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి కూడా పాల్గొన్నారు. దైవిక , ఆధ్యాత్మిక వాతావరణంలో కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాలలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ముఖ్యమంత్రి ప్రార్థించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలు, సిరి సంపదలతో జీవించాలనే సంకల్పంతోనే ఈ వరుణ యజ్ఞాన్ని నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.
భారతీయ సంస్కృతిలో వర్షాల కోసం యాగం, యజ్ఞం, పూజలు చేయడం అనేది మన పూర్వీకుల నుండి వస్తున్న ఆధ్యాత్మిక సంప్రదాయం. ప్రభుత్వం శాస్త్రీయ అంచనాలు , ప్రణాళికలతో ముందుకు సాగుతూనే, వర్షం, వ్యవసాయం, ప్రకృతి , మానవ జీవితాల మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించే సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ ప్రకృతి అనుగ్రహాన్ని కోరుకుంటోందని అన్నారు సీఎం. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, ‘ఎల్ నినో’ ప్రభావంతో ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ మహా వరుణ యజ్ఞాన్ని నిర్వహించింది.
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలి. కృష్ణా, గోదావరి నదులు నిండుగా ప్రవహించాలి. శ్రీశైలం, నాగార్జున సాగర్ సహా అన్ని ప్రాజెక్టులు జలకళతో నిండాలి. రాష్ట్రంలోని ప్రతి చెరువు, కుంట నీటితో కళకళలాడాలి. భూగర్భ జలమట్టాలు పెరగాలి. పంటలు సమృద్ధిగా పండాలి. రైతుల ముఖాల్లో చిరునవ్వులు విరియాలని ముఖ్యమంత్రి వరుణ దేవుడిని ప్రార్థించారు.

















