తిరుపతి : నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం చక్రస్నానం వైభవోపేతంగా, శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ దివ్య ఘట్టాన్ని దర్శించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు భక్తి పారవశ్యంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. అంతకు ముందు ఉదయం 7 గంటల నుండి 8.15 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు పల్లకీ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం పుష్కరిణి సమీపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు.
ఉదయం 9.15 గంటల నుండి 10.30 గంటల వరకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకాలు నిర్వహించి విశేష పూజలు చేశారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు చక్రస్నానం ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో జరిగిన అన్ని సేవలు సఫలమై, లోకక్షేమం, సకాల వర్షాలు, ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాల కోసం చక్రస్నానం నిర్వహించినట్లు ఆగమ పండితులు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొని చక్రస్నానాన్ని దర్శించిన భక్తులు సమస్త పాప విముక్తులై, ఐశ్వర్యాలు, ధనధాన్య సమృద్ధిని పొందుతారని విశ్వాసం.
రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహించి తొమ్మిది రోజుల పాటు వైభవంగా సాగిన బ్రహ్మోత్సవాలకు పూర్ణాహుతి పలుకనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు నాగరాజు, చెంగల్రాయులు, అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.



















