న్యూఢిల్లీ : మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మేనకా సంజయ్ గాంధీ లేఖ రాశారు. తిరుపతి గంగమ్మ ఆలయంలో జరగనున్న జంతు బలులపై ఆందోళన వ్యక్తం చేయడం కలకలం రేపింది. మే 18, 19 తేదీల్లో భారీ స్థాయిలో జంతు బలులు జరుగనున్నట్లు ప్రస్తావించారు. వేలాది జంతువులను కారణం లేకుండా హతమారుస్తున్నారని వ్యాఖ్యానించారు. దేశంలోని అనేక రాష్ట్రాలు ఇప్పటికే జంతు బలులను నిలిపేశాయని గుర్తు చేశారు మేనకా గాంధీ. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో జంతు బలి దాదాపు నిలిచి పోయిందని పేర్కొన్నారు.
కర్ణాటకలో కూడా జంతు బలులు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయని తెలిపారు. జంతు బలులు సమాజంలో హింసను ప్రోత్సహిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆలయానికి వచ్చే కొందరు మద్యం సేవించి హింసాత్మకంగా ప్రవర్తిస్తున్నారని వాపోయారు. బలి సంప్రదాయాన్ని ఆపాలని సీఎం చంద్రబాబును కోరారు మేనకా గాంధీ. కొబ్బరికాయలు కొట్టే విధానం వంటి ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని సూచించారు. సతి, దొంగతనం, కోడిపందాలు వంటి పాత ఆచారాలు రద్దైనట్లే దీనిని కూడా ఆపాలని విజ్ఞప్తి చేశారు .
అమాయక జంతువుల హత్య చెడు ఫలితాలను తెస్తుందని హెచ్చరించారు. ఇప్పటికే జంతువులను బలి ఇవ్వడం అనేది చట్ట ప్రకారం పూర్తిగా నేరమని, అలా చేసినట్లు తేలితే శిక్షించ బడడం ఖాయమని పేర్కొన్నారు. ఇవన్నీ తెలుసుకోకుండా వ్యవహరిస్తే చర్యలు తప్పవని, దీనిపై పునరాలోచించాలని కోరారు సీఎం చంద్రబాబు నాయుడిని.
















